
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారుసు చేసింది. ప్రస్తుత చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఛత్తీస్ గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీచేయాలని సూచించింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర విశ్రా పేరును సిఫార్సు చేసింది.
అలహాబాద్ హైకోర్టు కు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ పేరును, రాజస్థాన్ హైకోర్టుకు త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అఖిల్ ఖురేషి పేరును సిఫార్సులు చేసింది. కర్ణాటక, మేఘాలయ, గుజరాత్, మధ్యప్రదేశ్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకం కోసం కూడా సుప్రీంకోర్టు కొలీజియం తమ సిఫార్సులతో కేంద్రానికి జాబితా పంపించింది. ఐదుగురు ప్రధాన న్యాయమూర్తులు సహా 28 మంది హైకోర్టు న్యాయమూర్తులను ఇతర హైకోర్టులకు బదిలీ చేయాలని వారు సిఫార్సు చేసినట్లు సమాచారం.
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీల భర్తీ ప్రక్రియను వేగంగా చేపడుతున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం కొలీజియం తాజాగా కేంద్రానికి ఈ సిఫార్సులు చేసింది. ఏపీ, తెలంగాణ సహా ఆయా హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి ఎనిమిది మంది పేర్లను ప్రతిపాదిస్తూ కేంద్రానికి జాబితా పంపించింది.
కేంద్రం త్వరలోనే ఈ సిఫారుసలకు ఆమోదముద్ర వేస్తుందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోస్వామి ఈ ఏడాది జనవరి 6న ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలీపై వచ్చారు. 8 నెలల్లోనే ఆయన్ను ఛత్తీస్ గడ్ సీజేగా బదిలీ చేయాలని సిఫారుసు చేయడం గమనార్హం.