IPL captains mistakes : వారేమీ అనామక ప్లేయర్లు కాదు.. ఎన్నో ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నారు. జాతీయ జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అటువంటి ప్లేయర్లు ఐపీఎల్లో తేలిపోతున్నారు. జట్లకు సారదులుగా ఉంటున్నప్పటికీ.. ఎందుకనో వారి అనుభవాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నారు. ఫలితంగా వారు సారథ్యం వహిస్తున్న జట్లు ఓడిపోతున్నాయి. వారు చేస్తున్న తప్పులు జట్ల భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
అక్షర్ కు ఏమైంది
ఇటీవల ఢిల్లీ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఓపెనర్ గా 18 సంవత్సరాల సాహిల్ ఫరాక్ అనే యువకుడిని రంగంలోకి దింపింది. అతడు అద్భుతమైన ఆటగాడు.. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ దాటిని తట్టుకునే స్థాయి మాత్రం అతడికి లేదు. ఈ విషయం తెలుసో, తెలియదో గాని.. అక్షర్ అతడిని ఓపెనర్ గా పంపించాడు.. తొలి మ్యాచ్ లోనే అతడు 0 పరుగులకు ఔట్ అయ్యాడు.. ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్ కంటే ముందు పంజాబ్ మీద 264 పరుగులు చేసింది. ఆ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. కీలకమైన క్యాచ్ లను నేలపాలు చేసింది. కరుణ్ నాయర్ ను సబ్స్టిట్యూట్ గా తీసుకొచ్చింది. అతడు రెండు క్యాచ్ లను నేలపాలు చేశాడు. అతడి స్థానంలో మరొక ఆటగాడిని తీసుకొచ్చి ఉంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. వరుస ఓటములతో ఢిల్లీ జట్టు ఏడస్థానంలోకి దిగజారిపోయింది.
వారి ముందు దిగదుడుపు
ఇటీవల రాజస్థాన్ జట్టు హైదరాబాద్ జట్టుతో పోటీ పడింది.. రాజస్థాన్ జట్టులో వైభవ్ సెంచరీ చేశాడు.. దీంతో హైదరాబాద్ ఎదుట రాజస్థాన్ భారీ టార్గెట్ విధించింది. అయినప్పటికీ ఆ లక్ష్యాన్ని హైదరాబాద్ బ్యాటర్లు ఛేదించారు. రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ తన వద్ద ఉన్న బౌలింగ్ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయాడు. రవి, రవీంద్ర జడేజాతో ఎక్కువగా ఓవర్లు వేయించలేకపోవడంతో రాజస్థాన్ మూల్యం చెల్లించుకుంది. వాస్తవానికి హైదరాబాద్ బ్యాటర్లు దూకుడుగా బ్యాటింగ్ చేయడంతో పరాగ్ భయపడ్డాడు. అందువల్లే ఎక్కువ ఓవర్లు రవికి, రవీంద్ర జడ్జకు ఇవ్వలేకపోయాడు.
పంత్ కు బుర్ర పనిచేస్తుందా
ఇటీవల కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో లక్నో కెప్టెన్ వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో విమర్శలకు కారణమవుతోంది. కోల్కతా జట్టు విధించిన స్కోర్ ను చేదించే క్రమంలో సమానం చేసింది లక్నో. మ్యాచ్ సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. సూపర్ ఓవర్ లో నికోలస్ పూరన్ ను ఓపెనర్ గా రంగంలోకి దింపాడు కెప్టెన్ పంత్. అతడు సున్నా పరుగులకే అవుట్ అయ్యాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ చివరి బంతిలో షమీ సిక్సర్ కొట్టాడు. స్కోర్లు సమం అవడానికి అతడే కారణం. నికోలస్ స్థానంలో షమీ ని పంపించి ఉంటే లక్నో జట్టుకు ఎంతోకొంత లాభం జరిగి ఉండేది. అతడు కనీసం పరుగులైనా చేసేవాడు.
మరోవైపు ఒక్క పరుగు మాత్రమే చేసిన లక్నో జట్టు.. చివరికి కోల్కతా ఇన్నింగ్స్ సమయంలో బంతిని ప్రిన్స్ యాదవ్ కు అందించింది. షమీకి బంతి అందించి ఉంటే పరిస్థితి ఇంకాస్త ఉత్తమంగా ఉండేదేమో.. రింకు సింగ్ తొలి బంతినే ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు.
