women’s t20 world cup 2026 : క్రికెట్ లో పురుషులదే డామినేషన్. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అయితే రోజురోజుకు క్రికెట్ లో మహిళల డామినేషన్ కూడా పెరిగిపోతుంది. ఐసీసీ అందిస్తున్న ప్రోత్సాహం.. మహిళల్లో క్రికెట్ పై పెరుగుతున్న ఆదరణ.. ఇంకా అనేక కారణాలు మహిళ క్రికెట్ ను ఒక స్థాయిలో ఉంచుతున్నాయి. మహిళా క్రికెట్ కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఐసీసీ కూడా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకుంటున్నది.
త్వరలో మహిళల టి20 ప్రపంచ కప్ మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి ఐసీసీ రికార్డు స్థాయిలో 82 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. 2024 సంవత్సరంతో పోల్చి చూస్తే ఇది 10 శాతం అధికం. విజేతగా నిలిచిన జట్టుకు 21.9 కోట్లు.. ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు 10.9 కోట్లు దక్కుతాయి. అంతేకాదు ఈ టోర్నీలో పోటీ చేసే ప్రతి జట్టుకు కనీసం 2.3 కోట్ల ఖచ్చితమైన నగదు బహుమతి లభిస్తుంది. జూన్ 12 నుంచి 12 జట్లతో ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఈ మెగా టోర్నీలో మహిళా క్రికెటర్ల పై కాసుల వర్షం కురవడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఐసీసీ ఇంతటి నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. మహిళలను క్రికెట్ వైపు ఆకర్షించేలా చేయటం.. క్రికెట్లో పురుషాధిక్య భావజాలం లేదని నిరూపించడం.. అందుకోసమే ఐసీసీ ఇంతటి విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకుంది. ఐసీసీ చైర్మన్ గా జై షా ఎన్నికైన తర్వాత.. మహిళల క్రికెట్ అభివృద్ధి కోసం ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు. అందువల్లే మహిళల క్రికెట్ టోర్నీలలో ప్రైజ్ మనీని పెంచేస్తున్నారు
మహిళలు క్రికెట్ ఆడేందుకు ఆసక్తిని చూపిస్తున్న నేపథ్యంలో పెంచిన ప్రైజ్ మనీ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని ఐసిసి భావిస్తోంది. ప్రస్తుతం మహిళల క్రికెట్లో టీమిండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ బలమైన జట్లుగా ఉన్నాయి. టి20 ప్రపంచ కప్ లో ఈ ఐదు జట్ల మధ్య పోటీ రసవత్తరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఈ ఐదు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డాయి. అయితే భారత్ ఫీనిక్స్ పక్షిలాగ పోరాటం చేసింది. బలమైన ఆస్ట్రేలియాను.. సమర్థవంతమైన దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు జరిగే టి20 వరల్డ్ కప్ లో కూడా టీమ్ ఇండియా ఇదే స్థాయిలో మ్యాజిక్ ప్రదర్శిస్తుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన టి20 టోర్నీలలో టీమ్ ఇండియా ప్లేయర్లు అద్భుతంగా రాణించారు. అదే జోరు కూడా టి20 వరల్డ్ కప్ లో కొనసాగిస్తారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
