FIFA World Cup : తెలంగాణలో ఫిఫా వరల్డ్ కప్ ప్రసారాల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పని వేళలు పొడిగించింది. ఈ నెల 19న తెల్లవారుజామున 4.30 గంటల వరకు, 20న తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం అమ్మకాలు కొనసాగేందుకు అనుమతి ఇచ్చింది. అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటీ?
నిర్ణయం ఎందుకు తీసుకున్నారు
బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఈ సడలింపు ఇచ్చినట్లు సమాచారం. ఫిఫా మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో, వాణిజ్య, అతిథ్య రంగాలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పొడిగించిన సమయాలు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్.. అంటే హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలు, అలాగే కమర్షియల్ , ప్రైవేట్ స్పోర్ట్స్, ఫుడ్ అండ్ బేవరేజ్ వేదికలకు వర్తిస్తాయి. న్యూస్ రిపోర్టుల ప్రకారం మ్యాచ్‌ల పబ్లిక్ స్క్రీనింగ్‌కు అనుమతి ఇచ్చి, సాధారణ వ్యాపార వేళలకు మించి పనిచేసేలా ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మ్యాచ్ టైమింగ్ ప్రభావం
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 12.30 గంటలకు ప్రారంభమవుతుందని, అందుకే లేట్‌నైట్ ఆపరేషన్లకు అవకాశం కల్పించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో 19, 20 తేదీల్లో స్క్రీనింగ్‌లకు భారీగా ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని అంచనా.
భద్రతా జాగ్రత్తలు
సడలింపులు ఇచ్చినప్పటికీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, నిబంధనల ఉల్లంఘనలపై జీరో టాలరెన్స్ కొనసాగుతుందని పోలీస్ శాఖ హెచ్చరికలు ఇచ్చినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అంటే వినోదానికి అవకాశం ఉన్నా, భద్రతా నియంత్రణలు కట్టుదిట్టంగానే ఉంటాయి.
