
గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల అధికారాల్లో కొన్నింటిని వీఆర్వోలకు బదిలీ చేస్తూ మార్చి 25న ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2ను హైకోర్టు సస్పెండ్ చేసింది. కేసు తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. గుంటూరు జిల్లా తోకలవానిపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. పంచాయతీ కార్యదర్శుల హక్కుల్ని హరించేలా ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 73సవరణకు, ఏపీ పంచాయతీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా జీవో ఉందని కోర్టుకు తెలపారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది.