Hanuma Vihari : తెలుగు క్రికెటర్ హనుమ విహారి మరోసారి వార్తల్లో నిలిచాడు. సరిగ్గా 2024లో ఎన్నికలకు ముందు హనుమ విహారి సంచలన ప్రకటన చేశారు. తనకు సత్తా ఉన్నప్పటికీ.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో రాజకీయాల వల్ల అవకాశాలు లభించడం లేదని.. క్రికెట్ అసోసియేషన్లో కొంతమంది పెత్తనం వల్ల తనలాంటి వారికి అవకాశాలు రాకుండా పోతున్నాయని హనుమ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో ఎన్నికల సమయం కావడంతో హనుమ విహారికి టిడిపి, జనసేన మద్దతుగా నిలిచాయి. సహజంగా అప్పుడు అధికారంలో వైసిపి ఉంది కాబట్టి.. హనుమ విహారిని విలన్ ను చేస్తూ ఆ పార్టీ అనుకూల పత్రిక కథనాలను ప్రసారం చేసింది.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. హనుమ విహారి కూడా వ్యాఖ్యాతగా కనిపించాడు.
మరోసారి వార్తలలో వ్యక్తిగా..
హనుమ విహారి మంగళవారం ఒక ట్వీట్ చేశాడు. అందులో తాను ఒక కీలక నిర్ణయం తీసుకుంటున్నానని.. ఇకపై తాను త్రిపుర జట్టుకు ఆడతానని ప్రకటించాడు. దీనిని కూటమి అనుకూల సోషల్ మీడియా వింగ్ పట్టించుకోలేదు. కానీ వైసీపీ సోషల్ మీడియా వింగ్ మాత్రం వదిలిపెట్టలేదు. ” గతంలో ఇదే హనుమ విహారి తన కెరియర్ గురించి మాట్లాడారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నిందలు కూడా వేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఉంది. ఎవరి వల్ల హనుమ విహారి ఈ నిర్ణయం తీసుకున్నాడు? అతడు ఎందుకు విసుగు చెందాడు? అతడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? ప్రతిభ ఉన్నప్పటికీ అతనికి ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదు? తనకు సామర్థ్యం ఉన్నప్పటికీ ఇక్కడ అవకాశాలు దక్కడం లేదని హనుమ విహారి చేస్తున్న ఆరోపణలకు ఎవరు సమాధానం చెబుతారు? దీనికి బాధ్యత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, టిడిపి పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని తీసుకుంటారా? లేక ఇంకొక పార్లమెంట్ సభ్యుడు సానా సతీష్ తీసుకుంటారా?” అని వైసిపి ప్రశ్నించింది.
ఎందుకింత ఆగ్రహం
హనుమ విహారి ప్రతిభ ఉన్న ఆటగాడు. భారత జాతీయ క్రికెట్ జట్టుకు సుదీర్ఘ ఫార్మాట్లో ప్రాతినిధ్యం వహించాడు. అప్పట్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడాడు. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించాడు. అటువంటి ఆటగాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తన కెరియర్ గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు. క్రికెట్ అసోసియేషన్లో నెలకొన్న రాజకీయాల గురించి అతను ప్రస్తావించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత మళ్లీ అతడు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అసోసియేషన్లో నెలకొన్న రాజకీయాల గురించి అతడు నేరుగా ప్రస్తావించాడు. ఇది కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. మరి దీనిపై ఏసీఏ బాధ్యులు ఎలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.