
అఫ్గానిస్థాన్ లో రక్తపాతాన్ని నివారించేందుకు తనకు కనిపించిన ఏకైక మార్గం దేశాన్ని వీడడమే అని, అందుకు వెళ్లిపోయానని అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తెలిపారు. సొంత దేశ ప్రజలు, అధికారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో బుధవారం ఫేస్ బుక్ వేదికగా ఆయన ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తన నిర్ణయాన్ని మరోసారి సమర్థించుకున్నారు. అయితే. అందరూ ఆరోపిస్తున్నట్లుగా తాను బ్యాగ్ ల నిండా డబ్బులేమీ తీసుకెళ్లలేదని, కట్టుబట్టలతో దేశాన్ని విడిచానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.