Gautam Gambhir : న్యూజిలాండ్ జట్టుతో వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమ్ ఇండియా ప్లేయర్లపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సిరీస్ ఓడిపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్లో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, గిల్, అయ్యర్, రవీంద్ర జడేజా దారుణంగా విఫలమయ్యారు. వీరిని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ ను ఏకిపడేస్తున్నారు.
ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఏకంగా 41 పరుగులతో ఓటమిపాలైంది. ఈ ఓటమిని భారత జట్టు అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 337 పరుగులు చేసింది. వాస్తవానికి టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకోకుండా బౌలింగ్ వైపు ఆసక్తిని చూపించాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత చేజింగ్లో టీమిండియా తీవ్రంగా ఇబ్బంది పడింది 46 ఓవర్లలో నే ఆల్ అవుట్ అయింది. 296 పరుగులు మాత్రమే చేయగలిగింది. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ తో అదరగొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అర్థ శతకాలతో ఆకట్టుకున్నారు.
టీమిండియా ఓటమి నేపథ్యంలో గౌతమ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గౌతమ్ గంభీర్ ను కోచ్ పదవి నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆటగాడిగా అతడు సూపర్ అని.. కోచ్ గా మాత్రం పూర్తిగా విఫలమయాడని చెబుతున్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి జట్లపై కూడా టీమిండియా ఓడిపోవడం ఏంటని వారు మండిపడుతున్నారు. భారత జట్టుకు చేసిన నష్టం చాలని.. వెంటనే కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని సూచిస్తున్నారు. ఇక జనవరి 21 నుంచి న్యూజిలాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్ లో కనుక టీమ్ ఇండియా విఫలమైతే గౌతమ్ గంభీర్ పరిస్థితి మరింత డోలయమానంలో పడుతుందని అభిమానులు చెబుతున్నారు. న్యూజిలాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్లో టీమిండియా విజయం సాధించాలని.. టి20 వరల్డ్ కప్ లో కూడా సత్తా చూపించాలని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ అది కనక జరిగితే గౌతమ్ గంభీర్ పోస్ట్ కు ఎటువంటి ఇబ్బంది లేనట్టే.
