https://oktelugu.com/

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్: కేసీఆర్ నమ్మినబంటుకు రేవంత్ షాక్

మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ను అరెస్టు చేయించాడు. ఇంకా కొంతమంది అధికారులను అదుపులోకి తీసుకున్నాడు. నేరుగా గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగంలో కీలకంగా పనిచేసిన ప్రభాకర్ రావు పైకి స్కెచ్ వేశాడు.

Written By: , Updated On : March 26, 2024 / 12:02 PM IST
Phone Tapping Case

Phone Tapping Case

Follow us on

Phone Tapping Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత ఉంది. ఇప్పటికే ఆమె జైలుకు వెళ్లి పది రోజులు గడిచిపోయాయి. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఈ వ్యవహారంతోనే లాక్కోలేక.. పీక్కోలేక కేసీఆర్ ఇబ్బంది పడుతుంటే..ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తో రేవంత్ గెలుకుతున్నాడు. గత ఏడు సంవత్సరాలుగా తనను పెట్టిన ఇబ్బందిని తలచుకుంటూ ఆ కేసును మరింత లోతుగా తవ్వుతున్నాడు. ఇప్పటికే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ను అరెస్టు చేయించాడు. ఇంకా కొంతమంది అధికారులను అదుపులోకి తీసుకున్నాడు. నేరుగా గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగంలో కీలకంగా పనిచేసిన ప్రభాకర్ రావు పైకి స్కెచ్ వేశాడు. పనిలో పనిగా ప్రణీత్ రావు కు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరును సీఎం రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చాడు. పర్వతగిరిలో వారు రూమ్ ఏర్పాటు చేశారని, భుజంగరావు, తిరుపతన్న అనే అదనపు ఏఎస్పీలు సహకరించారని పోలీసుల దర్యాప్తులో తేలడంతో ఈ కేసు మరింత జటిలంకాబోతోందని తెలుస్తోంది.

అయితే ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించింది అప్పటి ఇంటెలిజెన్స్ అధికారి ప్రభాకర్ రావు అని.. ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే అప్పటికే ఆయన అమెరికా వెళ్ళిపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై లుక్ అవుట్ నోటీస్ జారీ చేసింది. మరోవైపు పోలీస్ శాఖ విచారణకు హాజరుకావాలని మెయిల్ కూడా చేసింది. మెయిల్ కు ప్రభాకర్ రావు రిప్లై ఇవ్వలేదు. అయితే రాష్ట్ర డిజిపి రవి గుప్తాకు ఫోన్ చేశారని తెలుస్తోంది.” నేను గత ప్రభుత్వంలో కీలక అధికారిగా ఉన్నాను. వారు చెప్పిన పని చేశాను. సబార్డినేట్ హోదా లో ఉన్నాను కాబట్టి కచ్చితంగా వారు చెప్పినట్టు చేయాల్సిందే. పోలీసు ఉద్యోగాలు అంటేనే అలా ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఈ ప్రభుత్వంలో ఎలాగైతే చేస్తున్నావో.. నేను గత ప్రభుత్వంలో అలాగే చేశాను. అందులో నా తప్పేమీ లేదని” ప్రభాకర్ రావు డిజిపితో చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే దీనికి డిజిపి గట్టిగానే రిప్లై ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. “గతంలో మీరు అధికారిగా ఉన్నప్పుడు ఏం చేశారో మా వద్ద పూర్తి ఆధారాలున్నాయి. మిమ్మల్ని మేము అరెస్టు చేయడం లేదు. మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీరు వస్తే నివృత్తి చేసుకుంటాం. అందు గురించే ఒకసారి విచారణకు రండి. నేనేం ప్రభుత్వం తరఫున అక్రమాలకు పాల్పడటం లేదు. అడ్డగోలు పనులు చేయడం లేదు. నా విధి నేను నిర్వహిస్తున్నాను. నాకు వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా విచారణ చేస్తున్నాను. అంతేతప్ప ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లేదని” డిజిపి రవి గుప్తా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.

ఒక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పోలీస్ కస్టడీలో ఉన్న ప్రణీత్ రావు చెప్పిన వివరాల ఆధారంగా ఏఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకపాత్ర పోషించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చివరికి బిజెపి పెద్దల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని.. అప్పట్లో కెసిఆర్ బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు డిఎల్ సంతోష్ ను అరెస్టు చేయించేందుకు రంగం సిద్ధం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో అసలు వాస్తవాలు విచారణ జరిపితే గాని బయటపడవని పోలీస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి