Anmol Buffalo :దాని విశాలమైన ముపూరం.. దృఢమైన గంగడోలు.. బలమైన కొమ్ములు.. తీక్షణమైన చూపు.. పటిష్టమైన కాళ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే దాని అందం వర్ణనకు అందదు. చూస్తే అది యముని మహిషం లాగా కనిపిస్తుంది. అలాగని అదేమీ సాధారణ దున్నపోతు కాదు. దాని ధర వింటే గుండెలు అదిరిపోతాయి. దాని ధర రెండు రోల్స్ రాయిస్ కార్లకు సమానంగా ఉంటుంది. పది బెంజ్ కార్ల ఖరీదు లాగా ఉంటుంది… ఇంతకీ దాని ధర ఎంత అంటే.. అక్షరాల 23 కోట్లు.. ఆ డబ్బులతో హైదరాబాద్ నగరం చుట్టూ 10 విల్లాలు కొనుగోలు చేయొచ్చు. అ దున్నపోతు పేరు అన్ మోల్.. మన తెలుగులో చెప్పుకోవాలి అనుకుంటే వెలకట్టలేనిది అని అర్థం..
ఎక్కడ ఉందంటే
అన్ మోల్.. హర్యానా రాష్ట్రంలోని సిర్సా జిల్లాలోని గిల్ అనే రైతు వద్ద ఉంది ఈ దున్నపోతు. దాని బరువు అటు ఇటుగా 1500 కిలోలు. ఇది అత్యంత మేలు జాతికి చెందిన దున్నపోతు. దీని వీర్యానికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. దాని వీర్యాన్ని విక్రయించడం ద్వారా గిల్ నెలకు 5 లక్షల వరకు సంపాదిస్తాడు. అందువల్లే దాని ఆరోగ్యాన్ని అత్యంత జాగ్రత్తగా చూసుకుంటాడు. దానిని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఇక ఇది దున్నపోతు ప్రతిరోజు పావు కిలో బాదంపప్పులు, నాలుగు కిలోల దానిమ్మ గింజలు తింటుంది. 30 అరటి పండ్లు లాగిస్తుంది. ఐదు లీటర్ల పాలను అవలీలగా తాగేస్తుంది. 30 గుడ్లను అమాంతం మింగేస్తుంది. పచ్చగడ్డిని క్షణంలో మాయం చేస్తుంది. తౌడు, సోయాబీన్స్, మొక్కజొన్నను కూడా కరకర నమిలేస్తుంది.. అన్ మోల్ తల్లి దృఢమైనది. అందువల్లే దాని లక్షణాలు దీనికి వచ్చాయి.. అన్ మోల్ తల్లి ప్రతిరోజు 25నిటర్ వరకు పాలు ఇచ్చేదట. అది గిల్ ఇంట్లో దాదాపు 15 సంవత్సరాల వరకు జీవించి ఉందట.. ఇటీవల కాలం చేసిందట. దానికి పుట్టిందే. అన్ మోల్. అన్నట్టు దీనిని సంరక్షించడానికి ఆరుగురు కార్మికులు పనిచేస్తారట. దీనికి దోమల కుట్టకుండా ఏసీ కూడా వాడతారట. నాలుగు వరుసల్లో దోమతెరలను ఉపయోగిస్తారట. అంతేకాదు ఇది తాగడానికి మినరల్ వాటర్ మాత్రమే వినియోగిస్తారట.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని వంటిపై వెంట్రుకలను పెరగనియ్యరట. అలా వెంట్రుకలు పెరిగితే గోమర్లు దాడి చేస్తాయట.. దాని ఒంటికి కుసుమ నూనెతో మర్దన చేసి.. ఉదయం సాయంత్రం రెండు కిలోమీటర్ల పాటు వాకింగ్ చేయిస్తారట. అప్పుడప్పుడు ఆపిల్ పండ్లు కూడా పెడతారట. ఇటీవల ఈ దున్నపోతుని కొనుగోలు చేయడానికి హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి వచ్చాడు.. ఏకంగా 23 కోట్లు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. కాని దానికి గిల్ ఒప్పుకోలేదు.