Relationship : ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు. ఎలా పడుతుందో కూడా తెలియదు. కొన్నిసార్లు ప్రేమ అవసరం ఎందుకు పడుతుందో కూడా తెలియదు. ఇప్పుడు మీరు చదవబోయే ఈ కథనంలో కూడా ఓ మహిళకు ప్రేమ కావాల్సి వచ్చింది. దానికంటే ముందు తోడు కావలసి వచ్చింది. విరహవేదనతో మునిగిపోతున్న ఆమెకు ఒక సాంగత్యం అవసరం పడింది. కానీ దానివల్ల చివరికి ఆమె మోసపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4.3 కోట్లు నష్టపోయింది. ఆస్ట్రేలియా లోని పెర్త్ నగరంలో అన్నెట్ ఫోర్డ్ అనే మహిళ జీవిస్తోంది. ఆమెకు 57 సంవత్సరాలు.. అన్నెట్ ఫోర్డ్ గతంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడింది. కొద్ది రోజులు రాసుకుపూసుకు తిరిగిన తర్వాత.. ఇద్దరూ ఒక్కటయ్యారు. కాపురం సజావుగానే చేశారు. ఉన్నట్టుండి ఏం జరిగిందో తెలియదు కానీ అన్నెట్ , ఆమె భర్త విడిపోయారు. నాటి నుంచి ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఈక్రమంలో ఒంటరి జీవితం ఆమెకు విరక్తిగా అనిపించింది. దీంతో ఒక తోడు కోసం వెతకడం మొదలుపెట్టింది. ఆమె ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. దీంతో ఓ వెబ్ సైట్ లో తనకు తగ్గట్టు ఉన్న ఓ తోడు కోసం వెతకడం మొదలుపెట్టింది. ఇంతలోనే విలియం అనే వ్యక్తి ఆమెకు తగిలాడు.
విలియం, అన్నెట్ మధ్య మాటలు మొదలయ్యాయి. సహజంగానే మాటకారి అయిన విలియం అన్నెట్ ను పడేశాడు. బుట్టలో వేసుకున్నాడు.. ఆ తర్వాత తన అవసరాలకు డబ్బులు కావాలని విలియం అడగడంతో అన్నెట్ మరో మాటకు తావు లేకుండా 1.6 కోట్లు అతడి ఖాతాకు బదిలీ చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు విలియం ఆమెతో మాట్లాడటం మానేశాడు. చివరికి తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. దీంతో తన మోసపోయానని అన్నెట్ భావించింది. ఈసారి ఫేస్ బుక్ లో నెల్సన్ అనే వ్యక్తి అన్నెట్ కు పరిచయమయ్యాడు. అతడు కూడా ఆమెకు మాయమాటలు చెప్పాడు. ఆ మాటలకు ఆమె పొంగిపోయింది. ఆ తర్వాత తన అవసరాల గురించి చెప్పాడు. కరిగిపోయిన అన్నెట్ కోటిన్నర దాకా సమర్పించుకుంది. మరో మహిళకు కూడా 98.5 లక్షలు ఇచ్చి నిండా మునిగింది..
ఇలా మొత్తం 4.3 కోట్లు అన్నెట్ మోసపోయింది. ఒంటరిగా ఉండేందుకు ఇష్టం లేక.. ఒక తోడు కోసం తాపత్రయపడిన అన్నెట్ నిండా మునిగింది. చివరికి 4.3 కోట్లు నష్టపోయింది. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతోంది. మరి వాళ్ళయినా అన్నెట్ కు న్యాయం చేస్తారో? లేదా పక్కన పెట్టేస్తారో? చూడాల్సి ఉంది.