AP Politics : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. డిజిటల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత ప్రతి చిన్న విషయం కూడా రచ్చ రంబోలా అవుతున్నది.. ప్రధాన మీడియా కూడా సోషల్ మీడియా అనే అనుసరిస్తున్నది.. దీంతో ఒక చిన్నమాట కూడా సెన్సేషన్ అవుతోంది. ఇప్పుడు అలాంటిదే సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ దర్శనమిస్తోంది. ఇటీవల ఏపీలో మిర్చి రైతులను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి ఆయన గుంటూరు మిర్చి యార్డు కు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర లభించడం లేదని రైతులు జగన్మోహన్ రెడ్డితో మొరపెట్టుకున్నారు. సహజంగా ప్రతిపక్ష నాయకుడు కాబట్టి.. పైగా ఇప్పుడు అధికారాన్ని కోల్పోయాడు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి తన పరిపాలన ఘనత గురించి చెప్పుకున్నాడు. తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు ఈ స్థాయిలో ఇబ్బంది పడలేదని గొప్పలు చెప్పుకున్నాడు. వచ్చేసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా మిర్చి రైతుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చాడు. ఆ కాడికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతులు సకల సంతోషాలతో ఉన్నట్టు.. గిట్టుబాటు ధరలతో తుల తూగినట్టు.. అన్నట్టు మిర్చి యార్డ్ లో జగన్మోహన్ రెడ్డి పర్యటించే కంటే ఒకరోజు ముందు విజయవాడలో జైల్లో విచారణ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించారు. ఆ తర్వాత ఆయన వస్తుండగా ఓ పాప తెగ హడావిడి చేసింది. జగన్మోహన్ రెడ్డిని చూడాలని పరితపించిపోయింది. ఆమెను చూసిన జగన్ తన వద్దకు పిలిపించుకున్నారు. నుదుటి మీద ముద్దు పెట్టి.. ఆమె సెల్ఫీ దిగుతుంటే ముచ్చట పడ్డారు.
ఈ వీడియోను వైసీపీ సోషల్ మీడియా తెగ ప్రచారం చేసింది. సహజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కావడం.. మొన్నటి ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే రావటం.. క్షేత్రస్థాయిలో నిరాశగా ఉన్న పార్టీ శ్రేణులను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలతో.. ఆ వీడియోను తెగ షేర్ చేయడం మొదలు పెట్టింది. ఈ వీడియో పై సహజంగానే టిడిపి, దాని అనుకూల మీడియా విమర్శలు చేయడం మొదలు పెట్టింది. టిడిపి అనుకూల ఛానల్ గా పేరుపొందిన ఏబీఎన్ లో దీనిపై చర్చ కూడా జరిగింది. ప్రైమ్ టైం లో నిర్వహించిన డిబేట్ లో ప్రజెంటర్ గా వెంకటకృష్ణ..ఈ డిబేట్ లో వక్తగా ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. ఇక ఆ పాప – జగన్ ఎపిసోడ్ ను వారికి తగ్గట్టుగా మాట్లాడుకున్నారు. రఘురామ కృష్ణంరాజు కొన్ని రకాల సెటైర్లు వేయగా.. దానికి వెంకటకృష్ణ మసాల అద్దారు. మొత్తానికి ఈ వీడియోలో తమ మార్క్ వెటకారాన్ని, ఆగ్రహాన్ని చూపించారు వెంకటకృష్ణ, రఘురామ కృష్ణరాజు. అయితే ఇక్కడ రఘురామకృష్ణంరాజు ఒక పొలిటికల్ లీడర్. పైగా జగన్ చేతిలో అతడు భంగపడ్డాడు. కాబట్టి అతడికి జగన్ అంటే కోపం ఉండడంలో తప్పులేదు. కానీ వెంకటకృష్ణ రఘురామ కృష్ణరాజును మించిపోయాడు. జగన్ పై ఏకపక్షంగా విమర్శలు చేశాడు. ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నాయి. “ఇదీ జర్నలిజం ముసుగులో ఓ ఛానల్ చేస్తున్న వ్యవహారమని” వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయి వ్యక్తి ఒక చిన్న పిల్లని ఇలా అనడం ఎంతవరకు సమంజసం ⁉️@vkjourno నీకు భగవంతుడు సిగ్గు అనేది పెట్టలేదా తూ
— For A Reason (@FAR_in_X) February 20, 2025