Dandora Movie Review : నటీనటులు: శివాజీ, నందు, నవదీప్, బిందుమాధవి తదితరులు.
సంగీతం: మార్క్ కె రాబిన్
ఛాయాగ్రహణం: వెంకట్ ఆర్ శాకమూరి
దర్శకత్వం: మురళికాంత్ దేవాసోత్
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని
లేటు వయసులో క్రేజ్ సంపాదించుకున్న శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా దండోరా. ప్రమోషన్స్ తో, శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ సినిమాపై అందరి చూపు పడింది. కులాల కుంపట్ల మధ్య ప్రేమికులు నలిగిపోయే కథాంశంతో నూతన దర్శకుడు మురళి కాంత్ రూపొందించిన ఈ దండోరా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో 2004 లో జరిగిన కథ ఇది. శివాజీ(శివాజీ) ఒక రైతు. అగ్రకులహంకారం అణువణువున నింపుకున్న వ్యక్తి. అతనికి ఒక కొడుకు విష్ణు(నందు), ఒక కూతురు సుజాత(మనిక చిక్కాల). అదే గ్రామంలో రవి(రవి కృష్ణ) అనే నిమ్నకులానికి చెందిన వ్యక్తిని సుజాత ప్రేమిస్తుంది. ఎలాగైనా ఇద్దరూ కలిసి బతకాలనుకుంటారు. ఇదే సమయంలో ఊరిలో కులాల మధ్య గొడవలు మొదలవుతాయి. ఈ గొడవల వల్ల ఎలాంటి సంఘటనలు జరిగాయి? చివరికి ఏమైందనేది తెరపై చూడాలి.
కులాల అంతరాల నేపథ్యంలో ప్రేమికుల కథను ఇంటెన్స్ గా చెప్పడంలో తమిళ దర్శకులు ఎప్పుడూ ముందుంటారు. తెలుగులో ఇలాంటి సినిమాలు తక్కువే. సరిగ్గా దండోరా అలాంటి తమిళ స్టైల్ ఉన్న సినిమానే. తమిళనాడులో జరిగిన ఒక వాస్తవ సంఘటనను ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెలుగు గ్రామం నేపథ్యంలో చెప్పారు. ఇదివరకూ చూడని ఒక కొత్త అంశాన్ని తీసుకుని ఈ కథను ప్రెజెంట్ చేయడం ఆసక్తికరంగా ఉంది. ఒక అగ్రకులపు వ్యక్తిని బాధితుడిగా చూపిస్తూ కథను ప్రారంభించడంతో ఎక్కువమంది ఆడియన్స్ ను ఇన్వాల్వ్ అయ్యేలా చేయగలిగారు. సినిమా అంతా గ్రిప్పింగ్ గా లేకపోయినా, కథనంలో కొంత తడబాటు ఉన్నప్పటికీ ఓవరాల్ గా చూస్తే మాత్రం సినిమా ఒక మంచిప్రయత్నం. కొన్ని బలమైన సీక్వెన్సులు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. ముఖ్యంగా ఇంటర్వల్ ఎపిసోడ్ కథను మలుపుతిప్పడమే కాకుండా ప్రేక్షకులని కథలోకి లీనమయ్యేలా చేస్తుంది. సెకండ్ హాఫ్ అంతా అదే ఇంటెన్సిటీతో సాగుతుంది. కొన్ని చోట్ల డ్రామా ఎక్కువైనట్టు అనిపించినా, కుల సమస్యకు సంబంధించిన సీన్లు ఓవర్ అనిపించినా సినిమా ప్రేక్షకులను నిరాశకు గురి చెయ్యదు.
శివాజీ ఈ సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకులను మరోసారి మెప్పించాడు. రెండు వేరియేషన్లు ఉన్న పాత్రలో అలవోకగా నటించాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ను శివాజీ నిలబెట్టాడు. సర్పంచ్ పాత్రలో నవదీప్ కొత్త లుక్ లో కనిపించడం విశేషం. ఇక మనిక చిక్కాల -రవికృష్ణ జంట బాగుంది. వేశ్య పాత్రలో బిందుమాధవి నటన బాగుంది. నందు ఒక విభిన్నమైన పాత్రలో కనిపించాడు, తన నటన కూడా బాగుంది.
మార్క్ కె రాబిన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు మాత్రం యావరేజ్ గా ఉన్నాయి. వెంకట్ సినిమాటోగ్రఫీ ఓకె. కథనం కొంత అటుఇటుగా ఉన్నప్పటికీ ఇలాంటి హార్డ్ హిట్టింగ్ కథను దర్శకుడు బలంగా చెప్పగలిగాడు. హార్డ్ హిట్టింగ్, ఇంటెన్స్ డ్రామాలు ఇష్టపడేవారికి నచ్చే సినిమా ఇది.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. ఓవర్ డ్రమాటిక్ అనిపించే కొన్ని సీన్స్
2. ఫ్లాష్ బ్యాక్, ప్రెజెంట్ చూపిస్తున్నపుడు కొంత క్లారిటీ మిస్ అయింది.
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. శివాజీ, నందుల నటన
2. కులవివక్షలోని కొత్త కోణం
రేటింగ్: 2.5/5
ఫైనల్ వర్డ్: పాస్ అయిన దండోరా
