Rohit Sharma – Virat Kohli : టీమిండియాలో విరాట్ కోహ్లీ గురించి, రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ చాలా సంవత్సరాలుగా టీమిండియా కు ఆడుతున్నారు. టీమిండియా క్రికెట్ మొత్తాన్ని శాసిస్తున్నారు. ఇటీవల 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు చేతిలో టీమ్ ఇండియా రెండు మ్యాచ్లు ఓడిపోయింది. తన చివరి మ్యాచ్లో మాత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపును అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ గెలుపు ద్వారా సిరీస్ ఓటమికి సరైన బదులు తీర్చుకుంది. వాస్తవానికి ఆస్ట్రేలియా ఇటీవల కాలంలో ఒక జట్టు చేతిలో అదికూడా సొంతమైదానంలో తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోలేదు. సొంత దేశంలో ఆస్ట్రేలియా కు టీమిండియా గర్వభంగాన్ని కలిగించింది అని చెప్పవచ్చు.
టీమిండియా మూడో వన్డేలో విజయం సాధించడం వెనక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముఖ్యపాత్ర పోషించారు. రోహిత్ సెంచరీ, విరాట్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. అంతేకాదు చివరి వరకు వీరిద్దరూ నాటౌట్ గా నిలబడ్డారు. రెండో వికెట్ కు సెంచరీకి మించిన భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమ్ ఇండియా గెలుపులో ముఖ్యపాత్ర పోషించారు. వీరిద్దరూ ఫామ్ లోకి వచ్చిన తర్వాత అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. దీనికంటే ముందు వీరిద్దరూ తమ రిటైర్మెంట్ గురించి కీలక ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు వీరిద్దరూ జట్టులో కొనసాగుతారని తెలుస్తోంది. అదే విషయాన్ని రోహిత్, విరాట్ పరోక్షంగా వెల్లడించారు. తను ఇంకా ఎంత విలువైన క్రికెట్ ఆడాల్సి ఉందని ప్రకటించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన విజయాన్ని సాధించిన నేపథ్యంలో టీమిండియా కు మూల స్తంభాల అయిన రోహిత్, విరాట్ గురించి కుట్రలు మొదలయ్యాయి. వారిద్దరిని జట్టు నుంచి బయటకు పంపించే మోసాలు కార్యరూపం దాల్చాయని సీనియర్ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆరోపించాడు. వాళ్ళిద్దర్నీ బయటికి పంపించడానికి కొందరు సెలెక్టర్లు ఎదురుచూస్తున్నారని అతడు సంచలన ఆరోపణలు చేశాడు. “టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ విఫలం కావాలని కొంతమంది సెలక్టర్లు ఎదురుచూస్తున్నారు. 2007 వన్డే వరల్డ్ కప్ నుంచి వారిద్దరిని తప్పించాలని భావిస్తున్నారు. వారిని జట్టు నుంచి తొలగించే అవకాశం ఎవరికీ కూడా ఇవ్వద్దని” మహమ్మద్ కైఫ్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. వరల్డ్ కప్ లో సౌత్ ఆఫ్రికా పిచ్ లపై ఆడిన ఆటగాళ్లు జట్టుకు కావాలని..ఈ పిచ్ ల పై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు బెరితమైన అనుభవం ఉందని.. అటువంటి ఆ సీనియర్ ప్లేయర్లను కచ్చితంగా వన్డే వరల్డ్ కప్ లో ఆడించాలని కైఫ్ డిమాండ్ చేశాడు.
రోహిత్, విరాట్ జట్టులో ఉంటే అదనపు బలం లభిస్తుందని.. అది ఎంతటి ప్రత్యర్థినైనా సరే ఓడిస్తుందని మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ జరుగుతున్నప్పుడు జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉండాలని.. యువ ఆటగాళ్లను టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసుకోవచ్చని.. వన్డే వరల్డ్ కప్ విషయంలో అలాంటి ప్రయోగాలు పనికిరాని కైఫ్ సూచించాడు. వన్డే ఫార్మాట్ సుదీర్ఘంగా సాగుతుందని.. అలాంటప్పుడు అనవసరమైన ప్రయోగాలు చేస్తే జట్టు మొదట్లోనే మునిగిపోతుందని కైఫ్ పేర్కొన్నాడు..