Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu birthday : చంద్రబాబు లైఫ్ లో అన్ని కష్టాలు పడ్డారా

Chandrababu birthday : చంద్రబాబు లైఫ్ లో అన్ని కష్టాలు పడ్డారా

Chandrababu birthday : చంద్రబాబు( Chandrababu).. ఈ పేరులోనే ఒక ఫైర్ బ్రాండ్ ఉంది. అసాధారణ ప్రస్థానం ఆయనది. అలుపెరగని ప్రయాణం ఆయనది. నారావారి పల్లె నుంచి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యేవరకు ఆయన జీవితంలో ఎదురైన ప్రతి పరిణామం ప్రత్యేకమే. ఆయన సాధించిన విజయాలు అనితర సాధ్యం. రాజకీయాలే ఆయన శ్వాసగా భావించారు. అభివృద్ధిపైనే ఆయన ధ్యాస ఉంచేవారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం మొక్కవోని దీక్షతో.. ధైర్యంతో పాటు దిగువ ప్రదర్శించే వన్ అండ్ ఓన్లీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు. ఒక సామాన్యుడు అనితర సాధ్యమైన విజయాలు సాధించగలరు అని నిరూపించిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు.

* కష్టపడే తత్వం..
చంద్రబాబు రాజకీయ ఉన్నతి పూల పాన్పు కాదు. ఎన్నెన్నో ప్రతికూలతలు, వ్యతిరేక ప్రచారాలు అధిగమించి విజయాలు అందుకున్న నేత. ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా.. విభజిత ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా.. మూడు దశాబ్దాలకు పైగా ప్రతిపక్షనేతగా.. తెలుగుదేశం పార్టీ అధినేతగా.. ఇలా రాజకీయంగా బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్రబాబు. 1996లో ఉన్నప్పుడు 2020 గురించి కలగన్నారు. 2024లో ఏకంగా 2047 ను ఆవిష్కృతం చేస్తున్నారు. లోతైన ఆలోచనలు కలిగిన అపర చాణుక్యుడు.. విజయం తట్టేవరకు అపజయాన్ని దీటుగా ఎదుర్కొనే మొండివాడు. నేడు చంద్రబాబు జన్మదినం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

* నాలుగున్నర దశాబ్దాల రాజకీయం..
76 సంవత్సరాల చంద్రబాబు ( CM Chandrababu) తన జీవితంలో దాదాపు 48 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆయన 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యారు. మూడు పదుల వయసులోనే మంత్రి పదవి చేపట్టారు. నాలుగు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రతికూల పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పాటు ప్రభుత్వాన్ని హస్త గతం చేసుకున్న చంద్రబాబుపై ఎన్నెన్నో ఆరోపణలు వచ్చాయి. 1995లో ముఖ్యమంత్రి అయిన ఆయన నిజమైన పాలన ఎలా ఉంటుందా అని చేసి చూపించారు ఏపీ ప్రజలకు. రైతు బజార్లు, జన్మభూమి, ఈ సేవ, ఇంటర్లో మూడు ప్రశ్నపత్రాల విధానం, ఇంజనీరింగ్ కాలేజీల పెంపు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్.. ఇలా ఎన్నెన్నో చంద్రబాబు పాలనలో సరికొత్త విప్లవాలు కనిపిస్తాయి. విపత్తుల వేళ సమర్థవంతమైన నాయకత్వం ఎలా ఉండాలో చేసి చూపించారు చంద్రబాబు. పాలనలో తనదైన మార్కు చూపించిన ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు.

* కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంట్రీ..
1978లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ( Congress Party) తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు. పులివెందుల నుంచి రాజశేఖర్ రెడ్డి అదే సమయంలో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే అలా అడుగుపెట్టిన ఆ ఇద్దరు నేతలు అనతి కాలంలోనే మంత్రులు అయ్యారు. ఇద్దరూ రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కావడంతో గొప్ప స్నేహితులుగా మారిపోయారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. 1983లో తొలిసారిగా పోటీ చేసింది ఆ పార్టీ. అప్పటికే ఎన్టీఆర్ అల్లుడుగా చంద్రబాబు ఉన్నారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గానే పోటీ చేశారు చంద్రబాబు. కానీ తెలుగుదేశం అభ్యర్థి గెలిచారు. అటు తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు చంద్రబాబు. 1985లో నాదెండ్ల భాస్కరరావు తో ఎదురైన టిడిపి సంక్షోభం సమయంలో ఎన్టీఆర్కు అండగా నిలిచారు చంద్రబాబు. అది మొదలు 1995 టీడీపీ సంక్షోభం సమయం వరకు ఎన్టీఆర్ కు కుడి భుజం గా ఉండేవారు. అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీతో పాటు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్నారు. వెన్నుపోటు అనే విమర్శను తీవ్రంగా ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశాన్ని కబలిస్తుందని వార్తలు కూడా అప్పట్లో వచ్చాయి. కానీ వాటిని ఢీకొడుతూ 1999 ఎన్నికల్లో తన సారథ్యంలోనే టిడిపిని గెలిపించుకుని అసలు సిసలైన నాయకుడిగా గుర్తింపు సాధించారు చంద్రబాబు.

* అన్నీ మైనస్ లే
నందమూరి తారక రామారావు( Nanda Muri Taraka Rama Rao ) గొప్ప వాక్చాతుర్యంతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. కానీ చంద్రబాబు అలా కాదు. అసలు ఎన్టీఆర్ స్థానాన్ని చంద్రబాబు భర్తీ చేయగలరా? ఎన్నికల్లో పార్టీని గెలిపించగలరా అన్న పార్టీ శ్రేణుల అనుమానాలను 1999 ఎన్నికల్లో చంద్రబాబు పటాపంచలు చేశారు. ప్రత్యర్థులు చంద్రబాబు పని అయిపోయిందనుకున్న ప్రతిసారి వారి అంచనాలు తప్పాయి. బలం పెంచుకొని ఉవ్వెత్తున ఎగసిపడేవారు. అయితే చంద్రబాబును గుర్తింపు తెచ్చి పెట్టింది మాత్రం కేవలం ముందు చూపు మాత్రమే. ముందు తరాలకు ఏది ఉపయోగమో గుర్తించగల నేర్పరి చంద్రబాబు. అప్పటి సాంకేతిక విప్లవం నుంచి నేటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటర్.. ఇలా అన్నింటా ఆయన ముందు చూపు విస్పష్టం.

* గొప్ప ధైర్యంతో..
చంద్రబాబు విజయాలకు పొంగి పోరు.. అపజయాలకు కృంగిపోరు. 2004, 2009 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయేసరికి చంద్రబాబు పని అయిపోయిందని అంతా భావించారు. కానీ 2014 రాష్ట్ర విభజనతో చంద్రబాబు అవసరం అనివార్యంగా మారింది. ప్రజలు ఎటువంటి సాహసం చేయదలుచుకోలేదు. చంద్రబాబును ఎన్నుకున్నారు. కానీ 2019లో సీన్ మారింది. రాజకీయంగా కొత్తవారికి అవకాశం ఇస్తామన్న ఆలోచనతో చంద్రబాబును దారుణంగా ఓడించారు ఏపీ ప్రజలు. మరొకరు అయితే రాజకీయాలు మానుకునేలా అవమానం జరిగింది ఆ ఎన్నికల్లో టిడిపికి. కానీ చంద్రబాబు మాత్రం సంయమనంతో, ధైర్యంతో, తెగువతో నిలబడిన తీరు ప్రశంసనీయం. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి ఘన విజయం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక భాగస్వామ్యం. అలాగని జాతీయ రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదు. గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా కూడా వ్యవహరించిన ఆయన అదే ఎన్ డి ఏ కు గుడ్ బై చెప్పి ఇబ్బందులు తెచ్చుకున్నారు. అందుకే ఈసారి గెలిచిన తర్వాత కేంద్రంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఒక ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాల పాటు మనగలగడం అంత చిన్న విషయం కాదు. కానీ దానిని చేసి చూపించారు చంద్రబాబు. ఇప్పుడు మరో నాలుగు దశాబ్దాల పాటు తెలుగు నేలపై టిడిపి ఉండేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. తన వారసుడిగా నారా లోకేష్ కు ఇటీవల పట్టాభిషేకం చేశారు. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి ప్రోత్సహించారు. మొత్తానికైతే చంద్రబాబు సక్సెస్ ఫుల్ పొలిటికల్ జర్నీ కొనసాగుతోంది. ఏడున్నర పద్దుల వయసులో సైతం ఆయన నవ యువకుడిగా పని చేస్తున్నాడు. నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular