AP Fake Liquor Case : తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అనేది అతిపెద్ద పాపం. సొంత పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడవడం అనేది మరింత పెద్ద పాపం. ఈ పాపాన్ని జనార్ధనరావు చేశాడు. పైగా పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. అనేక ఇబ్బందులు పడి, అనేక కష్టాలు పడి అధికారంలోకి వచ్చిన పార్టీని ఇరకాటంలో పెట్టే పని చేశాడు. చివరికి శత్రువులతో చేయి కలిపి చేయకూడని దారుణం చేశాడు. ఇది అటు చంద్రబాబుకు.. ఇటు కూటమి ప్రభుత్వానికి తీవ్రమైన ఇబ్బందిని తెచ్చిపెట్టింది.
వాస్తవానికి చంద్రబాబు పార్టీ వ్యతిరేక విధానాలను ఏమాత్రం సహించరు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పనులు చేసే వారిని ఉపేక్షించరు. జనార్దన్ రావు విషయంలో కూడా చంద్రబాబు అదే చేశారు. తంబళ్లపల్లి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత వైసిపి, దాని అనుకూల మీడియా రెచ్చిపోయింది. అడ్డగోలుగా కథనాలు రాసింది. విష ప్రచారాన్ని జోరుగా చేసింది. కానీ, దానిని తిప్పికొట్టడంలో చంద్రబాబు విజయవంతమయ్యారు. పార్టీలో ఉంటూ, పార్టీకి ద్రోహం చేసిన జనార్దన్ రావుపై ముందుగా సస్పెండ్ వేటు వేశారు. ఆ తర్వాత ఆయనను బయటికి పంపించారు.. కొట్టకుండా, తిట్టకుండా అసలు విషయాలను బయటపెట్టించారు.. దీంతో తంబళ్లపల్లిలో ఏం జరిగిందో ఏపీ ప్రజలకు తెలిసిపోయింది.
ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వంపై వైసీపీ రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. విష ప్రచారం నుంచి మొదలు పెడితే ప్రభుత్వాన్ని కూల దోసే అనేక ప్రయత్నాలను చేస్తూనే ఉంది. సొంత మీడియా ద్వారా నిర్లజ్జగా బురద చల్లుతూనే ఉంది. ఇక ఆ పార్టీ నాయకులు మరో అడుగు ముందుకు వేసి.. టిడిపిలోనే ఉన్న కొంతమంది నాయకులతో శకుని సారధ్యం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రకరకాల పనులు చేయిస్తున్నారు. తంబలపల్లి లో జరిగింది కూడా అదే. జోగి రమేష్ మాయమాటలు నమ్మి జనార్దన్ రావు అడ్డగోలు పనులు చేశాడు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు. చివరికి చంద్రబాబు వేసిన ప్రణాళిక వల్ల జనార్దన్ రావు బయటకు వచ్చారు. నకిలీ మద్యం వ్యవహారాన్ని బయటపెట్టారు. కేవలం తంబళ్లపల్లి మాత్రమే కాకుండా, ఇబ్రహీంపట్నం లో కూడా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తంబళ్లపల్లిలో నకిలీ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కట్టదిట్టంగా చర్యలు తీసుకుంది. ఇబ్రహీంపట్నం వ్యవహారం కూడా వెలుగులోకి రావడం.. దానిని ముందుగానే సాక్షి మీడియా బయట పెట్టడంతో ప్రభుత్వానికి అనుమానం వచ్చింది. దీంతో ప్రభుత్వం జనార్దన్ రావు ను బయటికి పంపించడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే జోగి రమేష్ మాత్రమే కాకుండా, ఇంకా చాలామంది వైసిపి నాయకులకు కల్తీ మద్యం వ్యవహారంలో పాత్ర ఉందని తెలుస్తోంది.