Rinku Singh : టీమ్ ఇండియాకు వన్డేలు, టెస్టులలో గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మొదలయ్యే వన్డే సిరీస్ ద్వారా గిల్ టీమిండియా కు నాయకత్వం వహించబోతున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సారధిగా తను ఏమిటో నిరూపించుకున్నాడు గిల్. ఇప్పుడు స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా అదరగొట్టాడు గిల్. కెప్టెన్ గా తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందుకోబోతున్నాడు. అటు మేనేజ్మెంట్ సపోర్ట్, ఇటు గౌతమ్ గంభీర్ ప్రోత్సాహం ఉండడంతో గిల్ దూసుకుపోతున్నాడు. అదృష్టవంతుడైన ఆటగాడిగా ముద్ర వేసుకొని అదరగొడుతున్నాడు. అయితే టీమిండియాలో మోస్ట్ లక్కీయస్ట్ ప్లేయర్ గిల్ కాదు.. మరి ఎవరంటే..
టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మాట్లో అప్పుడప్పుడు జట్టులోకి వస్తుంటాడు రింకుసింగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్ కతా జట్టులో ఇతడు ఆడుతున్నాడు. 2023లో ఆడిన ఇన్నింగ్స్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. గుజరాత్ జట్టుతో జరిగిన ఆ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దుమ్ము దుమారం అనే స్థాయిలో ఇన్నింగ్స్ ఆడి సత్తా చూపించాడు. అప్పట్లో కోల్ కతా జట్టుకు మెంటార్ గా గౌతమ్ గంభీర్ ఉండేవాడు. రింకు సింగ్ అతడి దృష్టిలో పడ్డాడు. ఇక తర్వాత రింకు సింగ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్ కావడంతో.. టి20 ఫార్మాట్లో రింకు సింగ్ కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
పేద కుటుంబానికి చెందిన రింకు క్రికెట్ మీద ఇష్టంతో ఇక్కడదాకా వచ్చాడు. పేరుపొందిన క్రికెటర్ అవ్వడానికి అనేక కష్టాలు పడ్డాడు. చివరికి తాను అనుకున్నది సాధించాడు. ప్రియా సరోజ్ అనే పార్లమెంట్ సభ్యురాలితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. త్వరలోనే ఆమెతో కలిసి ఏడడుగులు నడవబోతున్నాడు. రింకు సింగ్ చదువుకున్నది పదవ తరగతి వరకే. ప్రియా సరోజ్ మాత్రం ఉన్నత చదువులు చదివింది. అయినప్పటికీ అతనిలో ఉన్న మంచి మనసుని చూసి ప్రేమించింది. ప్రియా సరోజ్ పార్లమెంట్ సభ్యురాలు అయినప్పటికీ.. ఏ మాత్రం దర్పాన్ని ప్రదర్శించదు. ప్రతి ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్తుంటుంది. ప్రకృతితో మమేకం అవుతూ ఉంటుంది. కూలీలతో ముచ్చటిస్తుంది. వ్యవసాయ పనుల్లో తన నేర్పరితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ప్రియకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్కులేషన్ లో ఉంది. చాలామంది ఆ వీడియోని చూసి రింకు ను అభినందిస్తున్నారు. అందమైన భార్య మాత్రమే కాదు, కష్టించి పనిచేసే సతీమణి దొరికింది.. టీమిండియాలో గిల్ కాదు నువ్వే అత్యంత అదృష్టవంతుడైన ఆటగాడివని నెటిజన్లు పేర్కొంటున్నారు.