https://oktelugu.com/

RS 1000 Note : బ్రేకింగ్ : ₹ 1,000 కరెన్సీ నోటుపై ఆర్బీఐ కీలక ప్రకటన

ఇండియన్ కరెన్సీ వ్యవస్థ బలంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. నాలుగు నెలల్లో రూ.2 వేల నోట్లు మార్చుకోవడం ఏమంత కష్టం కాదని తేల్చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవాలని సూచించారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 24, 2023 5:47 pm
    Follow us on

    RS 1000 Note : దేశంలో రూ.2 వేల నోట్లను రద్దుచేస్తూ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 23 నుంచి సెప్టెంబరు 30 వరకూ నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది. అయితే పెద్ద నోటు మార్పిడిపైదేశ వ్యాప్తంగా మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రజల నుంచి వ్యతిరేకత లేకపోయినా విపక్షాలు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదొక ఎన్నికల స్టంట్ గా అభివర్ణిస్తున్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో బ్లాక్ మనీ ప్రవాహాన్ని అడ్డుకునేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    అయితే ఈ పెద్ద నోటు రద్దు వెలువడిన నాటి నుంచే సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు పెద్దనోట్లు తీసుకునేందుకు విముఖత చూపుతుండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. సెప్టెంబరు 30 వరకూ రూ.2 వేల నోట్లు చలామనీలో ఉంటాయని.. ఎట్టి పరిస్థితుల్లో వాటిని తీసుకోవాల్సిందేనని.. లేకుంటే కేసులు సైతం నమోదుచేస్తామని హెచ్చరించింది. మరోవైపు మరో వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. రూ.2 వేల నోటను రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం దాని స్థానంలో రూ.1000 నోటును తిరిగి తీసుకురానుందని ప్రచారం జరుగుతోంది.

    రూ.1000 నోటుపై దుమారం రేగుతుండడంతో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పందించారు. కీలక ప్రకటన విడుదల చేశారు. దీనిపై స్పష్టతనిచ్చారు. రూ.1000 నోటు తీసుకురాబోతున్నట్లు వస్తోన్న వార్తలు అవాస్తవం. అవన్ని ఊహాగానాలు మాత్రమే. మా దగ్గర అలాంటి  ప్రణాళికలు ఏవీ లేవని తేల్చేశారు.  దీంతో ఇక దేశంలో పెద్ద నోట్లకు చెల్లుచీటి అని తేలిపోయింది. కొందరు ఆర్థిక నిపుణులు మాత్రం రూ.500  నోటు కూడా రద్దు చేస్తే మంచిదని చెబుతున్నారు. కాగా మరికొన్ని అంశాలపై ఆర్బీఐ గవర్నర్ మరింత క్లారిటీ ఇచ్చారు. ఇండియన్ కరెన్సీ వ్యవస్థ బలంగా ఉందని.. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. నాలుగు నెలల్లో రూ.2 వేల నోట్లు మార్చుకోవడం ఏమంత కష్టం కాదని తేల్చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను మార్చుకోవాలని సూచించారు.