Tollywood
Tollywood : బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీస్ పై రోజురోజుకి కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు కేవలం బిగ్ బాస్ సెలబ్రిటీస్, సోషల్ మీడియా సెలబ్రిటీస్ పై కేసులు నమోదు చేసిన పోలీసులు, ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ఉన్న నటులపై కేసులు నమోదు చేసారు. రానా దగ్గుబాటి(Rana Daggubati), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచు లక్ష్మి(Manchu Lakshmi), నిధి అగర్వాల్(Nidhi Agarwal) వంటి టాప్ మోస్ట్ సెలబ్రిటీలు ఈ లిస్ట్ లో ఉన్నారు. అదే విధంగా సిరి హన్మంత్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయని పావని, వర్షిణి, అనన్య నాగేళ్ల, నేహా పఠాన్, పండు, పద్మావతి,ఇమ్రాన్ ఖాన్ వంటి సెలెబ్రటీస్ పై కొత్తగా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం మీద 25 మందిపై మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
నేడు మొదటి విడత లో నమోదు కాబడిన 11 మంది సెలబ్రిటీలు విచారణకు హాజరైనట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా సెలబ్రిటీస్, బిగ్ బాస్ సెలబ్రిటీస్ అంటే వాళ్లకు కోట్ల రూపాయిలు డబ్బులు వస్తాయనే ఆశతో ఇలాంటి యాడ్స్ ఒప్పుకొని చేసి ఉండొచ్చు. కానీ ఒక్కో సినిమాకు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకునే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ లాంటి పాన్ ఇండియన్ నటులు కూడా ఇలాంటి యాడ్స్ చేయడం దురదృష్టకరం. పైగా విజయ్ దేవరకొండ త్వరలో బిగ్ బాస్ షో కి హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు అనే టాక్ కూడా ఉంది. ఆయనే సరైన మార్గంలో నడవకుండా, తనని అనుసరించే వాళ్ళను చెడగొట్టే ప్రయత్నం చేస్తుంటాడు, ఇక కంటెస్టెంట్స్ కి మంచి మాటలు చెప్పి వాళ్ళని ఎలా నడిపిస్తాడు అని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక ప్రకాష్ రాజ్ సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రపంచంలో జరిగే ప్రతీ అంశంపై తనదైన శైలిలో సోషల్ మీడియా ద్వారా స్పందించే ఆయన కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసాడట. ఆన్లైన్ రమ్మీ యాప్ కి ఆయన ప్రొమోషన్స్ చేసిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు నెటిజెన్స్. ప్రజా జీవితంలో ఉంటూ, సినిమాలు కూడా చేసే ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా యువతని తప్పు దోవ పట్టించే యాప్స్ కి ప్రొమోషన్స్ చేస్తుంటే ఈ సమాజం ఎటు వైపు పోతుంది. వీళ్ళని చూసి ఇంకో పది మంది చిన్న సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంలో తప్పు లేదు కదా అని అనుకోవచ్చు కదా. అలా అనుకొనే వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రొమోషన్స్ చేసి ఉండొచ్చు. వాళ్ళకంటే ముందు ఈ టాప్ సెలబ్రిటీస్ పై కరీనా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి డిమాండ్ ఎదురు అవుతుంది.