https://oktelugu.com/

Babu Mohan: పోయి పోయి కేఏ పాల్ నమ్మి అక్కడి నుంచి బరిలోకి బాబు మోహన్?

కేఏ పాల్ ఆధ్వర్యంలోని ప్రజాశాంతి పార్టీలో బాబూ మోహన్ చేరారు. ఏకంగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పదవిని పాల్ కట్టబెట్టారు.. అంతేకాదు వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి బరిలో నిలుపుతున్నట్టు ప్రకటించారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 26, 2024 / 01:34 PM IST

    Babu Mohan

    Follow us on

    Babu Mohan: టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యాడు. మరోసారి ఎన్నికలు జరిగితే అప్పుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచాడు. కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత వరుసగా జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. అప్పుడు భారత రాష్ట్ర సమితిలో చేరాడు. ఆ మరుసటి ఎన్నికల్లో టికెట్ రాలేదు. గత్యంతరం లేక బిజెపిలో చేరాడు. ఆ సారి ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పుడు కూడా అదే పరిస్థితి.. ఇదీ స్థూలంగా సీనియర్ కమెడియన్ బాబూ మోహన్ రాజకీయ చరిత్ర. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. ఇక రాజకీయాలకు దూరమవుతారని అందరూ భావించారు. కానీ ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

    కేఏ పాల్ ఆధ్వర్యంలోని ప్రజాశాంతి పార్టీలో బాబూ మోహన్ చేరారు. ఏకంగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పదవిని పాల్ కట్టబెట్టారు.. అంతేకాదు వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి బరిలో నిలుపుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్రంలో బిజెపికి ఓటు బ్యాంకు లేదు. అందువల్లే ఆ పార్టీ నాయకుడు బాబూ మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. ఆయనను వరంగల్ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించాం. మిగతా అన్ని స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటిస్తాం.. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఏక్ నాథ్ షిండే లు ఉన్నారు. వారిలో ఒకరు రేవంత్ రెడ్డి, మరొకరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకొకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కాంగ్రెస్ వంద రోజుల పరిపాలనలో రాష్ట్రంలో ప్రజలు తీవ్రమైన కష్టాలు పడుతున్నారు. తాగునీటి, సాగునీటి ఎద్దడితో నరకం చూస్తున్నారు. విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా లేదు.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎలా కాపాడుతుంది? ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చుతుంది? నా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలకు భరోసా ఇస్తానని” పాల్ ప్రకటించారు.

    బాబూ మోహన్ గత ఎన్నికల్లో బిజెపి టికెట్ నిరాకరించడంతో బెదిరింపులకు దిగారు. దీంతో బీజేపీ అధిష్టానం దిగివచ్చి ఆయనకు ఆందోల్ అసెంబ్లీ టికెట్ కేటాయించింది.. ఆ ఎన్నికల్లో ఆయన కేవలం 5000 ఓట్లు మాత్రమే దక్కించుకొని, దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. ఎన్నికల అనంతరం ఆయన భారతీయ జనతా పార్టీని వదిలిపెట్టారు. ప్రజాశాంతి పార్టీ కండువా కప్పుకున్నారు. 2018 ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి టికెట్ నిరాకరించడంతో ఆయన బిజెపిలో చేరారు. ఆ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కేవలం 2,404 ఓట్లు మాత్రమే సాధించి దారుణమైన ఓటమిని మూట కట్టుకున్నారు. అంతకుముందు 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన భారత రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బాబూ మోహన్ 1990లో టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1998 లో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2003, 2008 ఎన్నికల్లో ఆందోల్ నియోజకవర్గం లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టిడిపికి రాజీనామా చేసి భారత రాష్ట్ర సమితిలో చేరారు.. ఒక కాంగ్రెస్ మినహా మిగతా ప్రధాన రాజకీయ పార్టీలలో బాబూ మోహన్ కొనసాగారు. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఏ మేరకు ఓటర్లను ఆకట్టుకుంటారో వేచి చూడాల్సి ఉంది.