YCP: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీకి సంబంధించి మే 13న పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతుండగా.. ఏపీలో మాత్రం నాలుగో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే తాజాగా సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజాభిప్రాయం ఇది అంటూ తేల్చి చెబుతున్నాయి. మెజారిటీ సర్వే సంస్థలు వైసీపీకి అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన కొన్ని సర్వేల్లో కూటమికి అధికారం ఖాయమని తేలుతోంది. ఆత్మసాక్షి సర్వే ఒక సంచలన ఫలితాలను ప్రకటించింది. వైసిపి ఎట్టి పరిస్థితుల్లో ఓ ఏడు లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం లేదని తేల్చేసింది.
సాధారణంగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సర్వేలు చేపట్టడం చూస్తున్నాం. కానీ వైసిపి గెలుచుకునే ఛాన్స్ లేని నియోజకవర్గాలను ఆత్మసాక్షి సంస్థ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్ది రోజులుగా ఆ సర్వే సంస్థ ప్రతినిధులు సర్వే చేపట్టగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఓ ఏడు పార్లమెంట్ స్థానాల విషయంలో వైసిపి ఆశలు వదులుకోవాల్సిందేనని తేలింది. గత ఎన్నికల్లో వైసిపి 22 చోట్ల విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలకే పరిమితం అయ్యింది. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాలను టిడిపి దక్కించుకుంది.
అయితే తాజాగా ఆత్మసాక్షి చేపట్టిన సర్వేలో శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమండ్రి, అమలాపురం, నరసాపురం, గుంటూరు, కర్నూలు పార్లమెంట్ స్థానాలను వైసిపి ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోదని ఈ సర్వే సంస్థ ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ ఏడింటిలో గతంలో టిడిపి గెలిచిన శ్రీకాకుళం, గుంటూరు స్థానాలు ఉన్నాయి. అయితే ఈ ఏడింటిని వైసిపి టచ్ చేయలేదని చెబుతుండడం చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చారు. కేంద్రం మెడలు వంచుతానని కూడా స్పష్టం చేశారు. దీంతో ప్రజలు కూడా జగన్ అడిగినట్టు 22 మంది ఎంపీలను గెలిపించారు. అయితే వారు పేరుకే ఎంపీలు అన్నట్టు వ్యవహరించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధిగా పోరాటం చేయలేదు. దీంతో వైసీపీ ఎంపీలు అంటేనే ఒక రకమైన భావన ఏర్పడింది. అందుకే ఎంపీలుగా పోటీ చేసేందుకు వైసిపి నేతలు సైతం ముందుకు రాలేదు. అయితే వైసిపి ఏడు స్థానాల్లో గెలవలేదని సర్వే సంస్థ చెబుతోంది. అందుకు తగ్గట్టుగానే ఈ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయడం విషయంలో చాలామంది వైసిపి నేతలు భయపడిపోయారు. వైసిపి హై కమాండ్ ఎంపీ టికెట్ ప్రకటించిన తరువాత కూడా.. పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మొత్తానికైతే ఏడు పార్లమెంట్ స్థానాలను వైసిపి వదులుకోవాల్సిందేనని ఆత్మసాక్షి సర్వే చెబుతుండడం అధికార పార్టీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది.