AP Budget 2026 : ఏపీలో ( Andhra Pradesh) సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఏడాది దాదాపు అన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేసిన సంగతి తెలిసిందే. 2026-2027 వార్షిక ఏడాదిలో సైతం అన్ని రకాల పథకాలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్, అన్న క్యాంటీన్లు, ఆటో డ్రైవర్లకు సాయం.. ఇలా అన్ని పథకాలకు నిధులు కేటాయించారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల. వాటన్నింటినీ ప్రస్తావిస్తూ.. వాటికి కేటాయింపులను గుర్తు చేశారు.
* అన్నదాత సుఖీభవ పథకం పై కీలక ప్రకటన చేశారు. ఆ పథకానికి రూ.6,660 కోట్లు కేటాయించారు. ఏపీలో 46.86 లక్షల మందికి పిఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ కింద 20 వేల రూపాయల మొత్తాన్ని అందించగలిగారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో కేటాయింపులు చేశారు అన్నదాత సుఖీభవ పథకానికి.
* వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.13,598 కోట్లు కేటాయింపును ప్రతిపాదించారు వ్యవసాయ శాఖ మంత్రి. అందులో కీలకమైన అన్నదాత సుఖీభవ పథకం కూడా ఉంది. ఈ ఏడాదికి సంబంధించి చివరి విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈనెల 21న కేంద్రం అందించే పీఎం కిసాన్ తో అన్నదాత సుఖీభవ నిధులు విడుదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
* మరోవైపు విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి కూడా భారీగా నిధులు కేటాయించారు. ఈ విద్యా సంవత్సరంలో పిల్లల చదువుకు గాను రూ. 9668 కోట్లు కేటాయించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15వేల రూపాయల చొప్పున సాయం అందించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆ పథకానికి భారీగా నిధులు కేటాయించడం విశేషం.
* ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి రూ. 27719 కోట్లు కేటాయించారు. మరోవైపు కొత్త పింఛన్లకు సంబంధించి మంత్రి కీలక ప్రకటన చేశారు. త్వరలో కొత్త పింఛన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. మొత్తానికి అయితే ఏపీ బడ్జెట్లో సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించడం చూస్తుంటే మాత్రం.. అమలు చేసిన పథకాలన్నింటినీ కొనసాగిస్తారని అర్థమవుతోంది.