రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర బడ్జెట్ కొనసాగింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రధాన రంగాలకు కేటాయింపులు గణనీయంగా పెంచారు. కూటమి అధికారంలోకి వచ్చి మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది. అయితే గత ఏడాది కంటే దాదాపు పది నుంచి పదిహేను వేల కోట్ల కేటాయింపులు పెరిగాయి. రాష్ట్ర అభివృద్ధితోపాటు ప్రజాసంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. కాగా ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లుగా చూపారు. మూలధన వ్యయం రూ.53,915 కోట్లు. రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు, ఇక ద్రవ్య లోటు రూ.75,868 కోట్లు.
* రాజధాని అమరావతి నిర్మాణానికి 6000 కోట్ల రూపాయలు కేటాయించారు. గత బడ్జెట్ లో ను ఇంతే మొత్తాన్ని కేటాయింపులు చేశారు.
* విద్యుత్ రంగానికి రూ.13,934 కేటాయించారు.
* పారిశ్రామిక రంగానికి సైతం ప్రాధాన్యమిచ్చారు. రూ.3161 కోట్లు కేటాయించారు.
* సర్దుబాటు నిధి కింద ఓ 1500 కోట్ల రూపాయలను చూపారు.
* ఏప్రిల్ ఒకటి నుంచి ఉపాధి హామీ పథకం మారనున్న సంగతి తెలిసిందే. ఈసారి రాష్ట్ర ప్రభుత్వ వాటా పెంచారు. పెంచిన వాటాకు అనుగుణంగా రూ.8365 కోట్లు కేటాయించారు.
* ఈసారి గృహ నిర్మాణానికి సైతం ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఏకంగా రూ.5451 కోట్లు కేటాయించారు.
* ఎన్టీఆర్ వైద్య సేవకు 4000 కోట్లు
* జల జీవన్ మిషన్ కు 4000 కోట్లు
* స్వచ్ఛభారత్ మిషన్ కు 1037 కోట్లు
* విశాఖ ఆర్థిక ప్రాంతం పరిధిలో పది జిల్లాలకు 28 వేల కోట్లు
* రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు 30 వేల కోట్లు.
* ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు.
* మరోవైపు పోలవరం ప్రాజెక్టుకు ఈసారి 6,105 కోట్లు బడ్జెట్లో కేటాయించారు.