Andhra Pradesh Women Scheme : ఏపీలో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు సర్కార్ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అనేక నూతన పథకాలను అమలు చేసింది. తాజాగా మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆర్థికంగా ఎదిగేలా నగరాలు, పట్టణాల్లో ఎగ్ మార్టులు ఏర్పాటు చేసుకునేలా సాయం అందించనుంది. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ పేద మహిళలకు ఉపాధి కల్పించే వీలుగా.. కొత్తగా ఎగ్ మార్ట్ లు త్వరలో ప్రారంభం ఉన్నాయి. ప్రతి జిల్లాలో పది చొప్పున మొత్తం 260 మార్ట్ లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో మార్ట్ ఏర్పాటుకు 50 వేల రూపాయల చొప్పున నిధులు సమకూర్చనున్నారు.
* ఎన్ఇసిసి నేతృత్వంలో..
దేశవ్యాప్తంగా కోడిగుడ్ల విక్రయానికి గాను నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ( National egg coordination committee ) ఆధ్వర్యంలో ఈ మార్ట్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 50 వేల రూపాయలు కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 35 వేల రూపాయలతో కార్డ్ అంటే బండి, ఇతర సామాగ్రి అందిస్తారు. మరో 15 వేల రూపాయల విలువైన గుడ్లు సరఫరా చేస్తారు. గుడ్లతో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రధానంగా రద్దీ ప్రాంతాల్లో ఈ మార్ట్ లు ఏర్పాటు కానున్నాయి.
* మెప్మా ఆధ్వర్యంలో..
స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ మార్కుల ఏర్పాటు విషయంలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు మెప్మా( mapma ) ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో.. ఇప్పటివరకు ఎలాంటి ఉపాధి నోచుకోని.. ఒంటరి మహిళలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. అర్హులైన మహిళలను ఎంపిక చేసేలా ఇప్పటికే మెప్మా ఆదేశాలు జారీచేసింది. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని.. వచ్చే నెలలో ఎగ్ మార్ట్ లను ప్రారంభించేలా అధికారులు దృష్టి సారించారు. అయితే రూపాయి పెట్టుబడి లేకుండా ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు. మొత్తం పెట్టుబడిని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అందించనుందన్నమాట.
