https://oktelugu.com/

Ambati Rayudu: అంబటి రాయుడు ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? మళ్లీ వైసీపీలోకి ఎందుకొస్తున్నాడు?

అంబటి రాయుడు ఏపీ రాజకీయాల్లో కొద్దిరోజుల పాటు చక్కర్లు కొట్టారు. అటు క్రికెట్ ఆడుతూనే రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఏపీ సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేసేవారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : March 27, 2024 / 02:18 PM IST

    Ambati Rayudu

    Follow us on

    Ambati Rayudu: ఏపీ రాజకీయాల్లో అంబటి రాయుడు కాక ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజుల కిందట వైసీపీలో చేరిన ఆయన పట్టుమని పది రోజులు కూడా ఆ పార్టీలో ఉండలేదు. ఏకంగా బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. దీంతో రాయుడు జనసేన లో చేరతారని ప్రచారం జరిగింది. అది కూడా జరగలేదు. అటు అభ్యర్థుల ఎంపికలో సైతం అంబటి రాయుడు పేరు కనీస ప్రస్తావనకు రాలేదు. తనకు క్రికెట్ లో ఉజ్వల భవిత ఉందని..చెప్పుకొని వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ఆయన చేసిన ట్విట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. యూటర్న్ తీసుకున్నారా? అన్న అనుమానం కలుగుతోంది.

    అంబటి రాయుడు ఏపీ రాజకీయాల్లో కొద్దిరోజుల పాటు చక్కర్లు కొట్టారు. అటు క్రికెట్ ఆడుతూనే రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఏపీ సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేసేవారు. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆడుదాం ఆంధ్రకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. ఆయన వైసీపీలో చేరే ఉద్దేశంతో ఏడాది ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారు.రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశారు. వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలిగారు. వన్ ఫైన్ మార్నింగ్ తాడేపల్లి వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కానీ అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ.. పది రోజులకే వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. రాజకీయాలు తనకు సూట్ కావని.. ఏవేవో మాటలు చెప్పి పవన్ కళ్యాణ్ ని కలిసారు. దీంతో అక్కడ నుంచి సైలెంట్ అయిపోయారు. కానీ ఉన్నట్టుండి ఈరోజు వేకువ జాము సమయంలో ‘ సిద్ధం’ అని ట్విట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో రచ్చకు కారణం అవుతోంది.

    ఈరోజు నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ఇడుపాలపాయలో రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనల అనంతరం బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇటువంటి పరిస్థితుల్లో అంబటి రాయుడు సిద్ధం అంటూ ట్విట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే వైసిపి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించింది. గతంలో గుంటూరు ఎంపీ స్థానాన్ని ఆశించి అంబటి రాయుడు వైసీపీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అది దక్కక పోవడం వల్లే ఆయన బయటకు వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు అభ్యర్థుల ప్రకటన పూర్తయిన తర్వాత అంబటి రాయుడు ఈ తరహా ట్విట్ చేయడం కొత్త తరహా ప్రచారానికి కారణమవుతోంది. మరి ఇందులో ఏ వ్యూహం ఉందో? తెలియాల్సి ఉంది.