https://oktelugu.com/

Delhi Liquor Scam: కేజ్రీవాల్ అరెస్ట్.. కొత్త పోరాటం షురూ

కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి కార్యకర్తలతో కలిసి భారీ కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం ఆప్ కార్యకర్తలు తమ సోషల్ మీడియా ఖాతాలలో ప్రొఫైల్ పిక్చర్ లను మార్చారు.

Written By: , Updated On : March 26, 2024 / 12:22 PM IST
Delhi Liquor Scam

Delhi Liquor Scam

Follow us on

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. బెయిల్ కోసం ఆయన తరపు లాయర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయన ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణలో కొనసాగుతున్నారు. అయితే ఆయనను అధికారులు ఏ అంశాల మీద ప్రశ్నలు అడుగుతున్నారు? ఆయన ఏం సమాధానం చెబుతున్నారు? అనే విషయాలపై అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఒక్క విషయం కూడా బయటకు పోకుండా జాగ్రత్త వహిస్తున్నారు. తనను అరెస్టు చేసిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తన తరఫున అధికారులకు లేఖ పంపించారు. నిబంధనల ప్రకారం జైలు నుంచి పరిపాలన సాగించడానికి వీలులేదని బిజెపి ఆరోపిస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన నేపథ్యంలో ఆప్ నేతలు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసిన నాడు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయినప్పటికీ కేంద్ర బలగాలు వారిని వారించాయి. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలలో కార్యకర్తలు రోజుకో తీరుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా వాట్సప్ డీపీ( డిస్ ప్లే పిక్చర్) ఉద్యమానికి శ్రీకారం చుట్టారు.

కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి కార్యకర్తలతో కలిసి భారీ కొవ్వొత్తుల ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం ఆప్ కార్యకర్తలు తమ సోషల్ మీడియా ఖాతాలలో ప్రొఫైల్ పిక్చర్ లను మార్చారు. కటకటాల వెనుక కేజ్రీవాల్ ఉన్న ఫోటోలను తమ డిస్ ప్లే పిక్చర్ లు గా మార్చుకున్నారు. మోడీ కా సబ్సే బడా దార్ కేజ్రీవాల్ (మోడీని భయపెట్టే కేజ్రీవాల్) అనే టెక్స్ట్ డిస్ ప్లే పిక్చర్ కింద రాస్కొచ్చారు..”అరవింద్ కేజ్రీవాల్ ఎటువంటి తప్పు చేయలేదు. ఆయనకు సంఘీభావంగా ఆప్ నాయకులు దేశవ్యాప్తంగా డిపి ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆప్ కార్యకర్తలు తమ డిపిలు మార్చుకున్నారని” ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి పేర్కొన్నారు..”దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొనాలి. తమ సోషల్ మీడియా ఖాతాల్లో డీపీ చిత్రాలను మార్చుకోవాలని” అతిషి కోరారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రివాల్ ప్రస్తుతం అధికారుల కస్టడీలో ఉన్నారు. సౌత్ గ్రూప్ నకు అనుకూలంగా అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ విధానాన్ని మార్చారని, దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడిందని దర్యాప్తు సంస్థల అధికారులు అభియోగాలు మోపారు. ఇప్పటికే కొంతమంది అప్రూవర్లు అరవింద్ కేజ్రీవాల్ పాత్ర పై స్పష్టమైన సమాచారం అందించారని.. వాటి గురించి విచారణ జరిపిన తర్వాతే తాము అరవింద్ ను అరెస్టు చేశామని దర్యాప్తు సంస్థల అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత విచారణలో అరవింద్ ఎటువంటి విషయాలు వెల్లడించారనేదానిపై కొద్దిరోజులు ఆగితే స్పష్టత వస్తుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.