Viral Video : ఇలాంటి కష్ట సమయంలో ఒక ఆలంబన.. ఒక ధైర్యం.. సానుకూల శక్తి ఉంటే కచ్చితంగా వారు బతుకుతారు. అలాంటి భరోసా లభించక చాలామంది ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్య అనేది మహాపాపం అయినప్పటికీ.. సమస్యల ముందు తలవంచి ప్రాణాలను తీసుకుంటున్నారు. అయితే అరుదైన సంఘటనల్లో మాత్రమే వారు బతికి బట్ట కడుతున్నారు. అయితే అలాంటి సంఘటనే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో చోటుచేసుకుంది.. సోమవారం జరిగిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. భద్రాచలం పట్టణం మీదుగా గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదిపై 2 వంతెనలు ఉన్నాయి. మొదటి వంతెన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిర్మించారు. ఆ వంతెన నేటికీ దృఢంగానే ఉంది. ఇది అంతరాష్ట్రియ వంతెనగా కొనసాగుతోంది. ఈ వంతెన పై నిత్యం రద్దీ ఉంటుంది. అయితే సోమవారం ఓ వ్యక్తి ఆ వంతెన పై ఉన్న రెయిలింగ్ పై కూర్చున్నాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రెయిలింగ్ పై ఆ వ్యక్తి అలా కూర్చోడాన్ని ఓ వ్యక్తి చూశాడు. అతడు బైక్ పై వెళ్తుండగా ఈ దృశ్యం కనిపించింది. వెంటనే తన బైక్ ఆపి.. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు.
మాటల్లో పెట్టి..
ఆ వ్యక్తి దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన ఆ బైకర్.. మాటల్లో పెట్టాడు. నీకేం కావాలి అని అడిగాడు. నువ్వు ఏం అడిగినా ఇస్తానని చెప్పాడు. నువ్వు ఆత్మహత్య చేసుకోకు.. నీకు నేనున్నా అంటూ ధైర్య వచనాలు చెప్పాడు. అలా నడుచుకుంటూ నడుచుకుంటూ అతని వద్దకు వచ్చే ప్రయత్నం చేశాడు. ఈలోగా అటువైపు నుంచి మరో బైకర్ వచ్చాడు.. వెంటనే అతడిని తన రెండు చేతుల్లో అదిమి పట్టుకొని వెనక్కిలాగాడు. ఆ తర్వాత అతడిని చుట్టుపక్కల వారు గట్టిగా పట్టుకున్నారు.. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ప్రస్తుతం అతనికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. వాస్తవానికి ఎవరో చనిపోతున్నారని.. నాకెందుకు అని వారు అనుకోలేదు.. పైగా ఆ చనిపోవాలనుకున్న వ్యక్తిని కాపాడారు. ధైర్య వచనాలు చెప్పి చావు నుంచి తప్పించారు. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడే మానవత్వం ఇంకా బతికింది అనిపిస్తుంది. భూమ్మీద మనుషుల్లో ప్రేమ.. సాటి మనిషి పై అనురాగం ఇంకా చచ్చిపోవాలనిపిస్తుంది. అయితే ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు మిగతావారు చేసిన ప్రయత్నాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. గొప్ప పని చేశారని కితాబిస్తున్నారు. కాగా, ఆర్థికపరమైన సమస్యల వల్లే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం అతడు భద్రాచలం పట్టణ పోలీసుల అదుపులో ఉన్నాడు.
భద్రాచలంలో గోదావరి నది వంతెన పైనుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన యువకుడు
యువకుడిని మాటల్లో పెట్టి చాకచక్యంగా కాపాడిన స్థానికులు pic.twitter.com/deZdXnM3pw
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2024