https://oktelugu.com/

Viral Video : మూడో కాన్పులో ఆడపిల్ల పుట్టింది.. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు.. వైరల్ వీడియో

ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చంపేస్తున్న రోజులు ఇవి. అలాంటి కాలంలో ఈ దంపతులు చేసిన పని సభ్యసమాజానికి కనువిప్పు కలిగించేలా ఉంది. ఆడపిల్లలను పుట్టనిద్దాం.. పెరగనిద్దాం.. ఎదగనిద్దాం.. అనే నినాదానికి నిలువుటద్దంలా ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 13, 2024 11:09 am

Viral Video

Follow us on

Viral Video :  అది తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి గ్రామం. ఆ గ్రామానికి చెందిన దంపతులకు తొలి రెండు కాన్పులలో మగ పిల్లలు జన్మించారు. ఇద్దరు మగ పిల్లలే కావడంతో ఆ తల్లిదండ్రులకు ఏదో వెలితి ఉండేది. ఆడపిల్లలేని ఇల్లు.. సందడిగా ఉండదని భావించి.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. మూడో కాన్పులో పండంటి ఆడపిల్ల జన్మించింది. దీంతో ఆ దంపతులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. ఆడపిల్ల పుట్టిందని సంబరాలు చేసుకున్నారు. ఆస్పత్రిలో ప్రసవించి.. డిస్చార్జ్ ఇంటికి వచ్చిన తర్వాత.. ఆ దంపతులకు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూలతో పాన్పు పరిచారు. ఇంటిని మొత్తం పుష్పాలతో అలంకరించారు. ఆడపిల్లను తీసుకొని ఆ మాతృమూర్తి పుట్టింటిలోకి అడుగుపెడుతుంటే.. గ్రామస్తులు మొత్తం ఘన స్వాగతం పలికారు. పండంటి ఆడపిల్లను చూసి మహాలక్ష్మి లాగా ఉందని దీవెనలు ఇస్తున్నారు. ఈ దృశ్యాలను ఆ గ్రామస్తులలో కొంతమంది వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైరల్ గా మారింది.

ఎంతోమందికి కనువిప్పు

ఈ వీడియో ఎంతోమందికి కనువిప్పు కలిగిస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు..” కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు చంపేస్తున్నారు. ప్రభుత్వం భ్రూణ హత్యల నివారణకు కృషి చేస్తున్నప్పటికీ.. కొంతమంది ఆలోచన విధానం మారడం లేదు. అందువల్ల ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది. పెళ్ళికాని యువకుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ అంతరం ఇలానే కొనసాగితే సమాజం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్లే ఆడపిల్లలను పుట్టనివ్వాలి. పెరగనివ్వాలి. ఎదగనివ్వాలి. ఆడపిల్ల అని ఈసడించుకోకూడదు. వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. స్వాతంత్రాన్నీ ఇవ్వాలి. అప్పుడే అంతరాలు లేని సమాజం ఏర్పడుతుంది. ఆడపిల్ల ఇంటికి మాత్రమే కాదు.. దేశానికి అందం. నట్టింట్లో ఆడపిల్లలు చేసే సందడి మాములుగా ఉండదు. అది ఎంతమంది మగ వాళ్ళు ఉన్నా ఆ సందడి రాదు. దీనిని ఆ దంపతులు నిరూపించారు. సమాజానికి గొప్ప పాఠాన్ని చెప్పారు. అనుసరించడం ఇకపై మన బాధ్యత అని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆడపిల్ల కోసం మూడో కాన్పు కోసం దాకా ఎదురుచూసిన ఆ దంపతులను నెటిజన్లు అభినందిస్తున్నారు. “మీరు గొప్ప పని చేశారు. సమాజంలో కొంతమంది తల్లిదండ్రులకు కనువిప్పు కలిగించారు. ఇలాంటివారిని ప్రభుత్వాలు భేటీ బచావో బేటి పడావో లాంటి కార్యక్రమాలకు అంబాసిడర్లుగా నియమించాలి. వీరి అనుభవాలను వీడియో లాగా రూపొందించి గ్రామాలలో ప్రదర్శించాలి. అప్పుడుగాని ఆడపిల్లల సంఖ్య పెరగదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో పురుషులకు స్త్రీలకు వ్యత్యాసం తీవ్రంగా ఉందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.