TCS bench policy: దేశంలో అత్యధిక మందికి ఉద్యోగాలను కల్పించే సంస్థలలో ఒకటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అయితే, ఇప్పుడు ఈ కంపెనీ కొత్త బెంచ్ పాలసీ ద్వారా ఉద్యోగుల్లో ఆందోళన నింపుతోంది. 35 రోజుల బెంచ్ పరిమితి గడువు దాటిపోవడంతో చాలా మంది ఉద్యోగులు వణుకుతున్నారు. దాదాపు 15-18శాతం మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోతారనే భయంలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే, 30,000 మందికి పైగా టీసీఎస్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను పోగొట్టుకుని ఇంటి బాట పట్టనున్నట్లు తెలుస్తోంది.
Also Read: మన అమ్ములపొదిలో బ్రహ్మాస్త్రం.. శత్రు దేశాలు భస్మీ పటలమే
ఐటీ కంపెనీలలో రకరకాల ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. కొందరు ఉద్యోగులకు కొన్నిసార్లు ప్రాజెక్టులలో పాల్గొనే అవకాశం లభించకపోవచ్చు. ఖాళీగా ఉన్న అలాంటి వారిని బెంచ్ సిట్టింగ్‌లో ఉన్నారని అంటారు. ఇలా ఉద్యోగులు ఇంటర్నల్ గా పని లేకుండా ఖాళీగా ఉండటానికి చాలా కారణాలు ఉండవచ్చు. వారికి తగిన ప్రాజెక్ట్ దొరకకపోవచ్చు, లేదా ప్రాజెక్ట్‌కు సరిపోయే స్కిల్స్ వారి వద్ద లేకపోవచ్చు. ఇలా అనేక కారణాలు ఉండవచ్చు. ఈ విధంగా ఒక ఉద్యోగి ఎక్కువ రోజులు బెంచ్‌లో ఉంటే, వారిని ఉద్యోగం నుండి తొలగించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ జూన్ 12న కొత్త బెంచ్ పాలసీని తీసుకొచ్చింది. ఉద్యోగుల బెంచ్ సమయం 35 రోజులు మించకూడదు అనేది ఈ పాలసీ ముఖ్య ఉద్దేశ్యం. అంటే, సంవత్సరంలో కనీసం 225 బిల్లింగ్ రోజులు ఉద్యోగి పని చేసి ఉండాలని ఈ టీసీఎస్ పాలసీ చెబుతోంది. 2026 జూన్ 11 వరకు దీనికి గడువు ఉండనుంది. దీంతో సోషల్ మీడియాలో టీసీఎస్ ఉద్యోగులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
టీసీఎస్ లో పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులు రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తమ ఆందోళనను షేర్ చేస్తున్నారు. టీసీఎస్‌లో ఏ రోజు చూసినా దాదాపు 15% నుండి 18% మంది ఉద్యోగులు బెంచ్‌లో ఉంటారు. అంటే, చాలా పెద్ద సంఖ్యలో ఉద్యోగులు 35 రోజుల బెంచ్ పరిమితిని దాటి ఉండవచ్చు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థలో ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒకవేళ 10% మందిని తొలగించినా, అది 60,000 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయినట్లే అవుతుంది. ఒకవేళ 15-18% మందిని తొలగిస్తే, ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త ఫీచర్.. ఇక రీల్స్ చూడడం చాలా ఈజీ
ఐటీ కంపెనీలలో ప్రాజెక్టులు లభించక బెంచ్‌లో కూర్చున్న వారిని తక్కువగా చూస్తారనే ఆరోపణ కూడా ఉంది. తమ నైపుణ్యాలకు తగిన ప్రాజెక్టులు దొరకలేదని చాలా మంది ఉద్యోగులు చెబుతున్నారు. బెంచ్‌లో ఉన్నప్పుడు ఏదైనా కొత్త స్కిల్స్ నేర్చుకున్నా, వేరే స్కిల్స్ అవసరమయ్యే ప్రాజెక్టులలోకి పంపుతారని కొందరు అంటున్నారు. అప్పుడు క్లయింట్లు తమను రిజెక్ట్ చేస్తారు. లేదా, తమకు వెళ్లడానికి సాధ్యం కాని సిటీలు లేదా దేశాలకు వెళ్లి పని చేయమని ఆర్డర్లు పాస్ చేస్తారు. ఇలా వివిధ కారణాల వల్ల ప్రాజెక్టులు చేజారిపోతాయని సోషల్ మీడియాలో ఐటీ ఉద్యోగులు తరచుగా తమ బాధను చెప్పుకుంటున్నారు.