Bihar Exit Polls 2025: పెరట్లో అరటి సొంత వైద్యానికి పనికిరాదు అంటారు.. ఈ సామెత పొలిటికల్ అనలిస్టు.. జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కు నూటికి నూరు శాతం సరిపోతుంది. ఎందుకంటే బీహార్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసింది.. ఒకవేళ ప్రజల మూడ్ మారి.. తన పార్టీ అభ్యర్థులను కనుక గెలిపిస్తే ముఖ్యపాత్ర పోషిస్తానని ఆయన కలలుగన్నారు. పైగా ప్రభుత్వంలో చక్రం తిప్పి..చాలా చేయాలనుకున్నారు. కానీ అవేవీ వాస్తవ రూపం దాల్చే విధంగా కనిపించడం లేదు.. స్థూలంగా చెప్పాలంటే పీకే పాచికలు బీహార్ లో పారే విధంగా అనిపించడం లేదు.
ప్రశాంత్ కిషోర్ విద్యావేత్త. అన్నింటికీ మించి వ్యూహాలు రచించడంలో దిట్ట. అటువంటి ప్రశాంత్ కిషోర్ దేశంలో 2014లో బిజెపికి.. తెలుగుదేశం పార్టీకి.. భారత రాష్ట్ర సమితికి.. వైఎస్ఆర్ సీపీకి.. మమతా బెనర్జీ పార్టీకి పొలిటికల్ సేవలు అందించారు. దీనికోసం భారీగానే తీసుకున్నారు. అంతేకాదు పీకేతో పని చేయడానికి చాలా పార్టీలు ముందుకు వచ్చాయి. కొన్ని పార్టీలు వెనక్కి వెళ్లిపోగా.. ఇంకా కొన్ని పార్టీలు ఆయన ద్వారా పని చేయించుకున్నాయి. ఆయన ద్వారా పనిచేయించుకున్న పార్టీలన్నీ అధికారాన్ని దక్కించుకోలేదు. అయితే మీడియాను మేనేజ్ చేయడంలో ప్రశాంత్ కిషోర్ సిద్ధహస్తుడు కాబట్టి.. తనకు లేని ప్రచారాన్ని కల్పించుకున్నాడు. భారీగానే దండుకున్నాడు.
అయితే ఇదే ఊపు బీహార్ ఎన్నికల్లో కనిపిస్తుందని ఆయన భావించాడు. కానీ క్షేత్రస్థాయిలో ఆయన ఊహించినట్టుగా పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన పార్టీ బీహార్ రాష్ట్రంలో ఉన్న పూర్తిస్థాయి నియోజకవర్గాలలో పోటీ చేయలేకపోయింది. దీనికి అభ్యర్థులు లేకపోవడం ఒక కారణమైతే.. క్షేత్రస్థాయిలో అంతగా బలం లేకపోవడం మరో కారణం. ఏది ఏమైనప్పటికీ పీకే బీహార్ రాష్ట్రంలో ఏమి పీకలేకపోయాడు. మంగళవారం రెండవ విడత పోలింగ్ పూర్తయిన తర్వాత.. అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అందులో ఏ సంస్థ కూడా ప్రశాంత్ కిషోర్ పార్టీ భారీగా స్థానాలు సాధిస్తుందని చెప్పలేకపోయింది. కొన్ని సంస్థలు అయితే ఒక్క స్థానం కూడా ప్రశాంత్ కిషోర్ పార్టీ సాధించదని చెప్పేశాయి. వాస్తవానికి రాజకీయాలు వేరు. రాజకీయ పార్టీలకు అందించే సేవలు వేరు. పార్టీలకు సేవలు అందిస్తే డబ్బులు ఇస్తాయి. సేవలు అందించే సంస్థలు రాజకీయాలు చేయలేవు.