Visakhapatnam Capital Issue: వైసీపీ నేతలకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫీవర్ పట్టుకుంది. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ చార్జి వైవీ సుబ్బారెడ్డి నుంచి మూడు ఉమ్మడి జిల్లాల మంత్రులు, మందీ మార్భలంతో దిగిపోయారు. పొరపాటున ఎమ్మెల్సీ ఓడిపోతే విశాఖ రాజధాని ప్రయత్నం నీరుగారిపోతుందని అధికార పార్టీ నేతలు లోలోపల భయపడుతున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానాన్ని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో మిగతా రాజకీయ పక్షాల నుంచి అధికార పక్షానికి గట్టి సవాళ్లే ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్రచారానికి వెళుతున్న అధికార పార్టీ నాయకులు యువత నిలదీతలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీతో పాటు శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కూడా జరగనుంది.. దీంతో శ్రీకాకుళంలో అధికార వైసీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్ర పార్టీ ఇన్ చార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజుతో పాటు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమావేశంలో మంత్రులు భయంతో కూడిన హెచ్చరికలు జారీ చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం కోల్పోతే మాత్రం మొదటికే మోసం వస్తుందని.. విపక్షాల చేతికి అస్త్రం ఇచ్చినట్టవుతుందని హెచ్చరించారు. అందరూ సమన్వయంతో వ్యవహరించి పట్టభద్రులను ఒప్పించాలని కోరారు.
అయితే ఇదే సభలో వైవీ సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రచారానికి వెళుతున్న అధికార పార్టీ నేతలకు యువత, విద్యార్థుల నుంచి నిలదీతలు ఎదురవుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావించారు. అదంతా విపక్షాల కుట్రగా అభివర్ణించారు. ఒకేసారి లక్ష ఉద్యోగాలిచ్చిన ఘనత సీఎం జగన్ దేనని ఊరూవాడా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా నష్టంజరుగుతుందని.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ బలపరచిన సీతంరాజు సుధాకర్ గెలుపునకు ప్రతిఒక్కరూ సహకరించాలని నేతలు భయంతో కూడిన హెచ్చరికలు, విన్నపాలు చేయడం ప్రాధన్యతను సంతరించుకుంది. ఇప్పటికే పార్టీ బలపరచిన అభ్యర్థికి ఎదురుగాలి వీస్తుందన్న వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో వాటిని నిజం చేస్తూ వైసీపీ కీలక ప్రజాప్రతినిధులు కామెంట్స్ చేయడం వైరల్ గా మారుతోంది.