Pawan Kalyan- Yuvashakti: యువశక్తి తడాఖా చూపించేందుకు జనసేనాని సిద్ధపడుతున్నారు. ఎన్నికల సమరభేరీ మొదలుపెట్టారు. 2023 కార్యాచరణను పవన్ ప్రారంభించారు. ఎన్నికల ఏడాది కావడంతో వ్యూహాత్మకంగా ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని నిర్ణయించారు. పార్టీకి వెన్నెముకగా ఉన్న యువత, విద్యార్థులను సంఘటితం చేసేందుకు యవశక్తి కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో తొలి యువభేరీకి నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పార్టీ తరుపున చకచకా ఏర్పాట్లు అవుతున్నాయి. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి పోస్టర్లను పవన్ ఆవిష్కరించారు. జనసేన కీలక నాయకులు నాదేండ్ల మనోహర్, నాగబాబులతో కలిసి ఆవిష్కరించిన అనంతరం పవన్ ప్రసంగంతో కూడిన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.

‘స్వామి వివేకానంద జయంతి నాడు జనసేన యువశక్తి కార్యక్రమం ఉంటుంది. స్వామి వివేకానంద స్ఫూర్తితో రణస్థలంలో యువశక్తి తడాఖా చూపించబోతోంది. యువతీయువకులు అందరూ ఆహ్వానితులే. యువత తమ ఆలోచనల గురించి, వారి కష్టాల గురించి, వారి భవిష్యత్ గురించి గళం వినిపించేలా యువశక్తి కార్యక్రమం ఉంటుంది. మన యువత మన భవిత అని భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’ అంటూ పవన్ కళ్యాణ్ సందేశమిచ్చారు. ప్రధానంగా ఉత్తరాంధ్ర యువత విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వలసపోవడాన్ని గుర్తించినట్టు చెప్పారు. అందుకే వారి మనోభావాలు, ప్రభుత్వపరంగా వారు కోరుకుంటున్న అంశాలను తెలుసుకునేందుకే యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ఉత్తరాంధ్ర నుంచి వలసలు అధికం. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అంతంతమాత్రం. అందుకే లక్షలాది మంది యువత వలసబాట పట్టారు. ఈ క్రమంలో వారి ఆకాంక్షలు, జనసేన ప్రభుత్వం ఏర్పాటుచేస్తే ఏం చేయాలి? యువత కోసం ఎటువంటి పథకాలు రూపొందించాలి? అని తెలుసుకునేందుకు పవన్ యువశక్తి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్ర యువతలో పవన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందుకే తొలి యువశక్తి కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలో ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ యువశక్తి కార్యక్రమాన్ని జరిపించాలని ప్లాన్ చేస్తున్నారు. అటు బస్సు యాత్రకు సమాంతరంగా కార్యక్రమాన్ని కొనసాగించడానికి పవన్ డిసైడ్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ సభలు, సమావేశాలకు వచ్చేది ఎక్కువగా యువతే. అయితే వీరిలో వచ్చేది ఎక్కువగా సినీ అభిమానంతోనే. వారంతా ఓటర్లుగా మారలేదన్న అపవాదు ఉంది. దాని గురించి పవన్ కూడా ప్రస్తావించారు. అభిమానులు ఓటర్లుగా, కార్యకర్తలుగా మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు అభిమానులను చూసి పొంగిపోయానని.. తీరా ఫలితాల వచ్చాక తెలిసింది వారంతా అభిమానులేకానీ.. తనను ఓటు వేయలేదని వాపోయారు. అదే విపక్షాలకు అస్త్రంగా మారింది. పవన్ చూడడానికి జనం వస్తారు.. ఓటేయ్యరు అని వ్యంగ్యంగా మాట్లాడానికి చాన్సిచ్చారు. ఈసారి ఈ తప్పిదం జరగకుండా పవన్ ముందుగానే జాగ్రత్తపడ్డారు. తనను అభిమానించే యువత, విద్యార్థులు జనసేనకు ఓటు వేసేలా మాట తీసుకోనున్నారు. మౌల్డ్ చేయనున్నారు. యువశక్తి కార్యక్రమం ద్వారా మెసేజ్ పంపనున్నారు.
