Homeఆంధ్రప్రదేశ్‌JP Nadda- Janasena: వైసీపీ వద్దు.. బీజేపీదే అధికారం..మరి జనసేన పరిస్థితి ఏంటి?

JP Nadda- Janasena: వైసీపీ వద్దు.. బీజేపీదే అధికారం..మరి జనసేన పరిస్థితి ఏంటి?

JP Nadda- Janasena: ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు సుదూరంగా ఉన్న పొత్తులు, నేతల వ్యాఖ్యలతో మంట పుట్టిస్తున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నేతల వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ, జనసేన రెండు పార్టీలు కాదు.. ఒకటే పార్టీ అన్నట్టు వ్యవహరించిన ఇరు పార్టీల నాయకులు ఇటీవల స్వరం మార్చారు. మిత్ర పక్షం మాట లేకుండా తమ పార్టీ గురించే చెప్పుకుంటున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కీలక చర్చకు కేంద్ర బిందువయ్యారు. రాష్ట్రంలో వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలని పిలుపునిచ్చారు. రాజమండ్రిలో నిర్వహించిన గోదావరి గర్జన సభలో ఆయన ప్రసంగించారు. ఏపీని వైసీపీ నాశనం చేస్తోందని మండిపడ్డారు. మాతృభాషను నిర్వీర్యం చేస్తున్నారని.. వ్యాపార వ్యతిరేక రాష్ట్రంగా ఏపీని తయారు చేశారని… అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని …ఆలయాలపై దాడులు చేస్తున్నారని… శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలను అణిచివేసేందుకే జగన్ పనిచేస్తున్నారని… కానీ తమను ఆపలేరని నడ్డా సవాల్ చేశారు. జాతీయ అధ్యక్షుడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో పెద్దగా ప్రస్తావించాల్సిన విషయం కాదు. కానీ ఎక్కడా జనసేన ప్రస్తావన తేవకపోవడమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

JP Nadda- Janasena
JP Nadda

క్లారిటీ ఇస్తారనుకుంటే..
వాస్తవానికి జేపీ నడ్డా పర్యటనతో జనసేన, టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇస్తారని అంతా భావించారు. ఒక అడుగు ముందుకేసి బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటిస్తారని సైతం ప్రచారం జరిగింది. కానీ అందుకు విరుద్ధంగా నడ్డా పర్యటన సాగింది. ఆయన కేవలం వైసీపీని తూలనాడుతూ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మాత్రమే చెప్పారు. బీజేపీ – జనసేన రావాలని ఎక్కడా చెప్పలేదు.

Also Read: AP Politics: ఏపీలో పొత్తుల ఎత్తులు.. చిత్తయ్యేదెవరు? గెలిచేదెవరు?

పరిస్థితి చూస్తూంటే… అసలు బీజేపీతో జనసేన పొత్తులో ఉందా లేదా అన్న సందేహం ఉత్పన్నమవుతోంది. రెండు పార్టీలు ఏం చేసినా కలిసి పనిచేస్తాయన్నట్లుగా ఉభయ పార్టీల నేతలు చెప్పుకునేవారు. కానీ ఎప్పుడు కలిసి కార్యాచరణ రూపొందించలేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వైఖరిపై పోరాటంలోనూ రెండు పార్టీలు కలిసి పనిచేసిన సందర్భాలు లేవు. అయితే అదే సమయంలో రాష్ట్ర నేతలతో తనకు పనిలేదని.. తనకు కేంద్ర పెద్దలు టచ్ లో ఉన్నారని కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆయనను పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. కనీసం జనసేన పేరును ప్రస్తావించడానికి బీజేపీ అగ్ర నేతలు సిద్ధపడడం లేదు. దీంతో జనసేనతో కటీఫ్ దిశగా బీజేపీ ఆలోచిస్తుందన్న కొత్త వాదన తెరపైకి వస్తోంది.

JP Nadda- Janasena
bjp- Janasena

ఆ ప్రకటనతోనే..
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పవన్ కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని ప్రకటించారు. విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొస్తానని అర్థం వచ్చేలా ప్రకటనలు చేశారు. ఎప్పుడైతే పవన్ ప్రకటన చేశారో అప్పటి నుంచి బీజేపీ స్వరంలో మార్పు వచ్చింది. పవన్ ప్రతిపాదనపై బీజీపీ నాయకులు పెద్దగా ఆసక్తికనబరచలేదు. టీడీపీతో పవన్ జట్టు కట్టనున్నట్టు తెలిసి బీజేపీ దూరం జరుగుతూ వస్తోంది. అదే సమయంలో పవన్ సీఎం అభ్యర్థి అంటూ ప్రచారం మొదలైంది. దీనికి కౌంటర్ ఇస్తూ ఎవరో అనుకున్నట్టుందని.. తనకు అంత ఆశ లేదని పవన్ తేల్చిచెప్పారు. సీఎం అభ్యర్థి ప్రచారం వ్యవహారంలో వైసీపీతో పాటు బీజేపీలోని ఒక వర్గం నాయకులు వ్యూహాత్మకంగా పవన్ కల్యాణ్‌ను నిర్వీర్యం చేసేందుకు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకెళ్లారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇటువంటి తరుణంలో బీజేపీ జనసేన పేరు ప్రస్తావించకపోవడం కొత్త పరిణామం. దీనిపై జనసేన వర్గాలు ఎలా స్పందిస్తాయన్నదానిపై తదుపరి రాజకీయం ఆధారపడి ఉంటుంది.

Also Read:Women’s Park: మహిళల కోసం హైదరాబాద్ లో ఓ ప్రత్యేక పార్క్.. ఆ పార్టీలూ చేసుకోవచ్చట!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

1 COMMENT

Comments are closed.

Exit mobile version