Raghurama Krishnamraju :  కేసీఆర్ ను మోసం చేసిన జగన్

వివేకా హత్యలో దస్తగిరి అప్రూవర్ గా మారితే విమర్శలు చేసే వారు.. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మార్చడానికి ఏమనుకోవాలని రఘురామ ప్రశ్నించారు.

Written By: Dharma, Updated On : June 2, 2023 9:52 am
Follow us on

Raghurama Krishnamraju : సొంత పార్టీపైనే విరుచుకుపడడంలో ఎంపీ రఘురామకృష్ణంరాజుది ప్రత్యేక శైలి. ప్రభుత్వ వ్యవహార శైలిని అడుగడుగునా నిలదీస్తూ అధినేతను ఇరుకున పెడుతుంటారు. అటు ప్రభుత్వం సైతం కేసుల రూపంలో రఘురామను వేధించినా వెనక్కి తగ్గడం లేదు. విమర్శలు, ఆరోపణల పరంపర కొనసాగిస్తున్నారు. తాజాగా మీడియా ముందుకొచ్చిన ఆయన మరోసారి జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. గత ఎన్నికల్లో అన్ని విధాలా ఆదుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను మోసగించేందుకు జగన్ సిద్ధపడ్డారని బాంబు పేల్చారు. ఢిల్లీ వేదికగా జరిగిన ఒప్పందాలను బయటపెట్టారు.
సీఎం జగన్ ఇటీవల ఢిల్లీ  వెళ్లిన సంగతి తెలిసిందే. నీతి ఆయోగ్ సమావేశం, పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి జగన్ హాజరయ్యారు. మూడు రోజుల పాటు అక్కడే గడిపారు. రహస్య సమావేశాలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన పక్కా పొలిటికల్ అజెండాతో ఢిల్లీ పర్యటన సాగించారని కామెంట్స్ వినిపించాయి. తాజాగా రఘురామ మాత్రం వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి బయటపడేందుకేనంటూ హాట్ కామెంట్స్ చేశారు. కొన్నిరకాల అనుమానాలను వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినట్టు వార్తలు వస్తున్నాయి. దీని వెనుక జగన్ ఉన్నారని రఘురామ ఆరోపిస్తున్నారు. వివేకా హత్య కేసులో కీలక వ్యక్తి పేరు బయటకు రాకుండా ఉండేందుకే కొత్త నాటకానికి తెరతీశారని అనుమానం వ్యక్తం చేశారు. శరత్ చంద్రారెడ్డి స్వయాన విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు. శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారి లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తుల పేర్లు చెబితే …వివేకా హత్య కేసులో కీలక వ్యక్తి పేరు రాకుండా చూస్తామని ఒప్పందం జరిగిందని రఘురామ ఆరోపిస్తున్నారు.
అదే జరిగితే కేసీఆర్ కుమార్తె కవిత చుట్టూ కేసు బిగుసుకునే అవకాశం ఉంది. అటు స్నేహితుడు కుమార్తె ప్రమాదంలో చిక్కుకునేందుకు పరోక్షంగా జగన్ కారణమవుతున్నాడన్న మాట. గత ఎన్నికల్లో కేసీఆర్ జగన్ కు ఎన్నివిధాలా సాయం చేశాడో అందరికీ తెలిసిందే. అటువంటి కేసీఆర్ కు ఇప్పుడు ఇబ్బందిపెట్టడంపై రఘురామ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇది ముమ్మాటికీ మిత్ర ద్రోహంగా చెబుతున్నారు. వివేకా హత్యలో దస్తగిరి అప్రూవర్ గా మారితే విమర్శలు చేసే వారు.. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మార్చడానికి ఏమనుకోవాలని రఘురామ ప్రశ్నించారు.