https://oktelugu.com/

India Vs Australia WTC Final: బలంగా ఆస్ట్రేలియా.. గాయాలతో టీమిండియా.. ఈసారి టెస్ట్ ఛాంపియన్ షిప్ దక్కేనా.?

టెస్టులకు ఆదరణ పెంచేందుకు ఐసీసీ ప్రయోగాత్మకంగా 2019లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసి)కి శ్రీకారం చుట్టింది. ఇందులో కోహ్లీ కెప్టెన్సీ లోని టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది.

Written By:
  • BS
  • , Updated On : June 2, 2023 9:49 am
    India Vs Australia WTC Final

    India Vs Australia WTC Final

    Follow us on

    India Vs Australia WTC Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి ముగిసింది. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ క్రికెట్ పై దృష్టి సారించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం భారత్ జట్టు సిద్ధమవుతోంది. ధోని సారధ్యంలోని టీమ్ ఇండియా జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని 2013 జూన్ 23న దక్కించుకుంది. ఈ ట్రోఫీ సాధించి ప్రస్తుతం పదేళ్లు కావస్తోంది. మధ్యలో రెండు వన్డే ప్రపంచ కప్ లు వెళ్ళిపోయాయి. నాలుగు టి20 పొట్టి కప్పులు జరిగాయి. ఓ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా నిర్వహించారు. కానీ భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీ నిరీక్షణ మాత్రం కొనసాగుతూనే ఉంది. దాదాపు దశాబ్దం గడుస్తున్నా మరో ఐసిసి టైటిల్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రూపంలో ఇండియాకు మరో అవకాశం వచ్చింది. విజేతగా నిలిచి ఐసిసి ట్రోఫీల కరువు తీరుస్తారేమో చూడాల్సి ఉంది.

    భారత జట్టు మరో ప్రతిష్టాత్మకమైన టోర్నీకి సిద్ధమవుతుంది. ఈ నెల ఏడో తేదీ నుంచి 11 వరకు ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం భారత జట్టు క్రీడాకారులు వరుసగా ఆ దేశానికి బయలుదేరుతున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు అక్కడకు చేరుకున్నారు. పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో భారత్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా తలపడుతోంది. 2019లో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమి పోలైంది. ఈసారి ఎలాగైనా విజయం సాధించి మరో ఐసీసీ ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని భారత జట్టు భావిస్తోంది.

    త్రుటిలో చేజారిన టెస్ట్ ఛాంపియన్షిప్ కప్..

    వన్డే, టి20 ప్రపంచ కప్.. ఇలా ప్రతిసారి మెగా టోర్నీ రాగానే భారత్ విజేతగా నిలుస్తుందని అభిమానులు ఆశలు పెంచుకోవడం.. జట్టేమో కప్పును అందుకోకుండానే నిష్క్రమించడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారింది. జట్టులో మార్పులు జరిగినా.. మరో ఐసీసీ కప్ కల మాత్రం నెరవేరడం లేదు. ధోని సారధ్యంలో 2011 వన్డే ప్రపంచ కప్ లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. కానీ, ఆ తరువాత జరిగిన రెండు వన్డే వరల్డ్ కప్ లో భారత్ కు నిరాశే ఎదురయింది. 2017, 2019లో సెమిస్ లోనే జట్టు నిష్క్రమించింది. 2015లో ఆస్ట్రేలియా చేతిలో, 2019లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. టి20 ప్రపంచ కప్ లో అయితే దాదాపు 16 ఏళ్లుగా ఎదురుచూపులు తప్పడం లేదు. 2007లో మొట్ట మొదటి టి20 ప్రపంచ కప్ ధోని కెప్టెన్సీలోని భారత్ కప్ సొంతం చేసుకుంది. కానీ, ఆ తర్వాత నుంచి మరో కప్ కోసం జట్టు పోరాడుతూనే ఉంది. 2014లో అందినట్టే అంది టైటిల్ చేజారింది. అప్పుడు ఫైనల్ లో శ్రీలంక చేతిలో ఓటమి ఎదురైంది. 2016లో సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో పరాభవం తప్పలేదు. కెప్టెన్ గా ధోనీకి అదే చివరి ప్రపంచ కప్. మరోవైపు 2017 ఛాంపియన్ ట్రోఫీలో ఆఖరి మెట్టుపై భారత్ జట్టు బోల్తా పడింది. కోహ్లీ కెప్టెన్సీ లోని టీమ్ ఇండియా.. ఆ తుది పోరులో చిరకాల ప్రత్యర్థి పాక్ చేతిలో చిత్తయింది. ఆ ఓటమి కంటే కూడా ఓడిన తీరు మరింత ఆవేదన కలిగించింది. 2019 వన్డే, 2021 టి20 ప్రపంచ కప్పులతో పాటు, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లోనూ జట్టును నడిపించిన కోహ్లీ.. కెప్టెన్ గా ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలనే కలను సాకారం చేసుకోలేకపోయాడు. ఇక రోహిత్ నాయకత్వంలోని భారత జట్టు నిరుడు టి20 ప్రపంచ కప్ సెమిస్ లో ఇంగ్లాండ్ చేతిలో మట్టి కరిచింది.

    గెలుస్తుందని భావించినా.. ఓటమి తప్పలేదు..

    టెస్టులకు ఆదరణ పెంచేందుకు ఐసీసీ ప్రయోగాత్మకంగా 2019లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసి)కి శ్రీకారం చుట్టింది. ఇందులో కోహ్లీ కెప్టెన్సీ లోని టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆడిన ఆరు సిరీస్ లకుగాను ఐదింటిని సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో ఆరంభ డబ్ల్యూటీసి ఫైనల్ కు అర్హత సాధించింది. న్యూజిలాండ్ తో 2021 జూన్ 18 నుంచి 23 వరకు ఈ తుది పోరు జరిగింది. వర్షం కారణంగా రెండు రోజుల ఆట సాధ్యం కాకపోవడంతో రిజర్వ్ డే అయిన ఆరో రోజు మ్యాచ్ నిర్వహించాల్సి వచ్చింది. ఇంగ్లాండులోని సౌత్ అంప్టన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగింది. అప్పటికే ఈ డబ్ల్యూటీసి చక్రంలో వేయికిపైగా పరుగులు చేసిన ఆటగాళ్లలో రహానే, రోహిత్ శర్మ ఉండడంతోపాటు కోహ్లీ కూడా మంచి ఫామ్ లో కనిపించాడు. అత్యధిక వికెట్లు పడగొట్టిన అశ్విన్ తోపాటు పేసర్లు షమీ, బుమ్రా, ఇషాంత్ శర్మతో బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపించింది. సుబ్ మన్ గిల్, పుజారా, పంత్, జడేజా.. ఇలా బలమైన జట్టు బరిలోకి దిగింది. ఈ అవకాశాన్ని అందుపుచ్చుకోవడంలో విఫలమైన భారత్.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించలేక సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీని అందుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్ లో 217 పరుగులకే ఆల్ అవుట్ అయిన భారత్ ప్రత్యర్థిని 249 పరుగులకే బాగానే కట్టడి చేసింది. కానీ, రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 170 పరుగులకే కుప్పకూలింది. దీంతో 139 పరుగులు లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది కివీస్ జట్టు. దీంతో డబ్ల్యూటీసీ గదను దక్కించుకున్న తొలి జట్టుగా నిలిచింది న్యూజిలాండ్.

    భారత్ కు సవాల్ విసురుతున్న ఆస్ట్రేలియా జట్టు..

    ఇప్పుడు వరుసగా రెండోసారి డబ్ల్యుటిసి ఫైనల్ ఆడబోతున్న టీమ్ ఇండియాకు ఐసీసీ ట్రోఫీకి మధ్య ఆస్ట్రేలియా అడ్డుగా ఉంది. 2021-23 డబ్ల్యూటీసి చక్రంలోనూ భారత్ ఆధిపత్యం చెలాయించిన కొంత తడబాటు తప్పలేదు. ఒడిదుడుకులు దాటి 18 మ్యాచ్ ల్లో 10 విజయాలు, మూడు డ్రాలతో పత్రికలో రెండవ స్థానంతో తుది పోరుకు అర్హత సాధించింది. కానీ, ఈసారి బ్యాటింగ్ లో నిలకడగా రాణించిన ఆటగాళ్లు లేరు. భారత్ తరపున అత్యుత్తమ ప్రదర్శన పూజార (16 మ్యాచుల్లో 887 పరుగులు), ఆ తరువాత కోహ్లీ (16 మ్యాచుల్లో 869 పరుగులు)తో ఉన్నాడు. కాస్త మెరుగ్గా కనిపించిన పంత్ (12 మ్యాచ్ ల్లో 868) ఇప్పుడు జట్టుతో లేడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అశ్విన్ (13 మ్యాచ్ ల్లో 61 వికెట్లు) ఎప్పటిలాగే అదరగొడుతున్నాడు. కానీ, ఆ తరువాత అత్యుత్తమ ప్రదర్శన చేసిన బౌలర్ బుమ్రా (10 మ్యాచ్ ల్లో 45) జట్టుకు దూరమయ్యాడు. రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటున్న పంత్ తోపాటు గాయాలతో బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ తుది పోరుకు అందుబాటులో లేకపోవడంతో జట్టుకు ముందే ఎదురు దెబ్బ తగిలింది. మరోవైపు అస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ లో కవాజా (1608 పరుగులు), లబుషేన్ (1509), స్మిత్ (1252), హెడ్ (1208), బౌలింగ్ విభాగంలో లయన్ (83 వికెట్లు), కమిన్స్ (53), స్టార్క్ (51)తో ఆస్ట్రేలియా దుర్భేద్యంగా కనిపిస్తోంది. తాజా సంచలనం గ్రీన్ తో ఆ జట్టు మరింత బలపడింది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న వనరులతో అత్యుత్తమ కూర్పును బరిలో దించి మంచి ప్రదర్శన చేసేలా సహచరుల్లో స్ఫూర్తి నింపి కెప్టెన్ రోహిత్ శర్మ అయిన టీమ్ ఇండియా నిరీక్షణకు ముగింపు పలకాలన్నది అభిమానుల ఆకాంక్ష ఆశ. చూడాలి డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఏ విధంగా రాణిస్తుందో.