ys jaganmohanreddy
‘సంకల్పం ముందు ఏదీ కష్టం కాదు’ అంటారు పెద్దలు. అది ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి సరిగ్గా సరిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వైఎస్సార్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఎన్ని ఒడిదొడుకులు అనుభవించారో ఎవరికి తెలియనది కాదు. ఓ సీఎం కొడుకు అయినప్పటికీ ఏనాడూ ప్రభుత్వంలో పెత్తనం చెలాయించకుండా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూనే వెళ్లారు. ఆ తర్వాత వైఎస్సార్ మరణంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. ఓ ఎంపీ అని కూడా చూడకుండా ఏడాదికి పైగా జైల్లో పెట్టారు. అయినా మనోనిబ్బరం కోల్పోకుండా జైలు నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని స్థాపించారు. తన తండ్రి పేరుతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని నామకరణం చేశారు. మొదటిసారి జరిగిన ఎన్నికల్లో అధికారం దరిచేరలేదు. అప్పటి నుంచి నిత్యం ప్రజల్లోనే ఉండిపోయారు. అయితే.. తన తండ్రికి కలిసివచ్చిన పాదయాత్రను అస్త్రంగా ఎంచుకొని పాదయాత్రకు దిగారు.
తను పాదయాత్ర మొదలు పెట్టిన రోజే ప్రజలకు చెప్పారు.. తండ్రి ఫొటో పక్కన తన ఫొటో పెట్టుకునేలా చేస్తానని.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి తీరుతారనని భరోసా ఇచ్చారు. చెప్పినట్లుగానే పాదయాత్రలో ఎన్ని సమస్యలు వచ్చినా లెక్కచేయలేదు. అన్ని వర్గాలకు చెందిన సమస్యలు విన్నారు. తను ఒక గ్రంథంలా సిద్ధం చేసుకున్న నవరత్నాలతోపాటు మరిన్ని అవసరాలను గుర్తించారు. సెకండ్ టైం ఎన్నికల్లో వాటినే ప్రచారాస్త్రాలుగా వాడారు. అటు పాదయాత్ర.. ఇటు ప్రచారంలో ఇచ్చిన హామీలు నమ్మిన ప్రజలు బంపర్ మెజార్టీ కట్టబెట్టారు. ఏకంగా 151 స్థానాల్లో గెలిపించి ప్రతిపక్షం లేకుండా చేశారు.
అధికారంలోకి రాగానే సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చేస్తున్న కృషిలో ఆయన తండ్రి వైఎస్సార్ కనిపిస్తున్నారు. ఒక పథకం తర్వాత మరో పథకం.. ఇలా తను ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. తండ్రి మాదిరిగానే ఇచ్చిన మాటకు కట్టుబడి పని చేస్తానని నిరూపిస్తున్నారు. ప్రపంచాన్నే కకావికలం చేస్తున్న కరోనా టైంలో దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేయని విధంగా టెస్టులు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఇదొక్కటి చాలదా ఆయన పాలన ఎలా నడుస్తోందో చెప్పడానికి.
నేడు దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో సమాధి వద్ద జరిపే పూజలకు సీఎం జగన్ వెళ్లారు. ‘పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం మా నాన్న గారు ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను’ అని చెప్పిన మాటలను నిలుపుకుంటున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. సంక్షేమానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు. కోటి ఎకరాలకు నీళ్లందించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడానికి జలయజ్ఞం కింద 84 ప్రాజెక్టులను చేపట్టి, సింహభాగం పూర్తి చేశారు. రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు సాధించడం ద్వారా అన్నపూర్ణ నామధేయాన్ని రాష్ట్రానికి సార్థకం చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టులను పూర్తి చేసి.. ఐటీ రంగం, పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయడం ద్వారా ప్రగతి రథాన్ని కొత్త పుంతలు తొక్కించారు. సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో మార్గ నిర్దేశకుడిగా నిలిచారు. ఆయన మన నుంచి దూరమై అప్పుడే 11 ఏళ్లు గడిచాయి. ఆ మహానేత దిశానిర్దేశం చేసిన మార్గంలోనే 15 నెలలుగా సీఎం జగన్ విప్లవాత్మక రీతిలో సంక్షేమాభివృద్ధి పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. మున్ముందు కూడా ఇలానే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి తన మార్క్ పాలన నిరూపించాలని ప్రజలూ కోరుకుంటున్నారు.