Nara Lokesh: చంద్రబాబు కేసుల విషయంలో మొన్నటి వరకు లోకేష్ ఒక ఫెయిల్యూర్ గా కనిపించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనే తెరవెనుక ఏదో చేశారన్న అనుమానం కలుగుతోంది. ముఖ్యంగా వైసీపీ నేతల్లో ఈ తరహా అనుమానం క్రమేపి బలపడుతోంది. అందుకే మొన్నటి వరకు లైట్ తీసుకున్నవారు.. అసలు లోకేష్ ఎక్కడికి వెళ్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అని ఆరా తీయడం ప్రారంభించారు. చంద్రబాబు కు బెయిల్ లభించడంతో లోకేష్ తదుపరి కార్యాచరణ ఏమిటని ఆరా తీసే పనిలో పడ్డారు.
చంద్రబాబు అరెస్టు తరువాత లోకేష్ పాదయాత్రను నిలిపివేశారు. నాలుగు రోజులు పాటు రాజమండ్రిలో ఉండి ఢిల్లీ వెళ్లిపోయారు. అది మొదలు లోకేష్ పై సైతం కేసుల నమోదు ప్రారంభమైంది. ఆయనను అరెస్టు చేస్తామంటూ లీకులు సైతం ఇచ్చారు. అయితే 30 రోజులపాటు పడిగాపులు కాసినా లోకేష్ ను కేంద్ర పెద్దలు పట్టించుకోలేదని వైసీపీ నేతలు ఆరోపించారు. చంద్రబాబుకు బెయిల్ ఇప్పట్లో లేదని ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చారు. అయితే అనూహ్యంగా చంద్రబాబుకు బెయిల్ లభించింది. ఇందులో లోకేష్ పాత్ర ఉందని తమకు తామే వైసిపి నేతలు ఊహించుకోవడం ప్రారంభించారు. చంద్రబాబు బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడు రాజమండ్రి లోనే లోకేష్ ఉన్నారు. అటు తర్వాత కొన్ని గంటలకే ఢిల్లీ పయనమయ్యారు. బుధవారం తిరిగి హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. దీంతో వైసీపీ నేతలు ఎక్కడో తేడా కొడుతోందని అనుమానిస్తున్నారు. అసలు ఢిల్లీలో లోకేష్ ఏం చేస్తున్నారన్నది వైసీపీ నేతలకు టెన్షన్ గా మారింది.
మొన్నటి వరకు ఈ కేసులు విషయంలో లోకేష్ పర్యవేక్షిస్తున్నారని ప్రచారం జరిగింది. టిడిపి వర్గాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కానీ అంతకుమించి ఏదో రాజకీయం ప్రారంభించారని ఇప్పుడు వైసీపీ శ్రేణులు అనుమానం పడుతున్నాయి. మరోవైపు రఘురామకృష్ణం రాజు జగన్ కేసులను ఇతర రాష్ట్రాలకు తరలించాలని పిటిషన్ వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ కేసు విచారణ శుక్రవారం జరగనుండడంతో లోకేష్ జగన్ చుట్టూ ఏదో చేస్తున్నారన్న అనుమానం వైసీపీలో పెరుగుతోంది. అసలు సిసలు రాజకీయం ప్రారంభమవుతుందని లోకేష్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. అది జగన్ కేసు లేనని వైసీపీ నేతలు ఒక నిర్ధారణకు వస్తున్నారు.
మొన్నటి వరకు లోకేష్ అంటే ఎగతాళి చేస్తూ వచ్చిన వైసీపీ నేతలు.. ఇప్పుడు అదే లోకేష్ ఎక్కడికి వెళ్తున్నారు అని ఆరా తీయడం విస్తు గొలుపుతోంది.చంద్రబాబు కేసుల్లో కనీస ఆధారాలు కూడా సిఐడి చూపకపోవడంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. కేసు ప్రారంభంలో లోకేష్ ఇదే ప్రయత్నంలో ఉండగా పెద్దగా వర్కౌట్ కాలేదు. అప్పట్లో లోకేష్ ఎక్కడికి తిరిగినా చంద్రబాబుకు బెయిల్ వచ్చే ఛాన్స్ లేదని వైసిపి నేతలు తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే వైసీపీ నేతలు చంద్రబాబుకు బెయిల్ విషయంలో లోకేష్ కు క్రెడిట్ ఇవ్వడం విశేషం. అందుకే లోకేష్ ఢిల్లీ పర్యటనలను నిఘవర్గాల ద్వారా తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.