YS Sharmila: తెలంగాణలో రాజకీయ వాతావరణం మామూలు వేడిగా లేదు. నిండు చలికాలంలో 50 డిగ్రీల ఉష్ణోగ్రతను మించిపోయింది. రేపు ఫలితాలు వెల్లడి కానుండటంతో రాజకీయ పార్టీలు విజయం తమదంటే తమదని ప్రకటనలు చేసుకుంటున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగ్గా కనిపిస్తుంటే.. భారత రాష్ట్ర సమితి ఈ ఎగ్జిట్ పోల్స్ ను కొట్టి పారేస్తోంది. అయితే ఎన్నికల వాతావరణం ఇలా ఉంటే.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మాత్రం కెసిఆర్ కు వెరైటీ గిఫ్ట్ పంపించారు. బై బై కేసీఆర్ అంటూ సూట్ కేస్ ను గిఫ్ట్ గా పంపించారు.
గతంలో షూస్
షర్మిల గతంలో పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కు షూస్ గిఫ్ట్ గా పంపించారు. తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ప్రగతిభవన్ దాటి వచ్చి షూస్ వేసుకొని తనతో పాటు వస్తే పరిస్థితి ఏమిటో తెలుస్తుందని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధిస్తుంది అని వార్తలు వెలబడుతున్న నేపథ్యంలో “బై బై కెసిఆర్.. కెసిఆర్ సూట్ కేసు పట్టుకుని సర్దుకునే టైం వచ్చింది. కెసిఆర్ గారు ప్యాక్అప్ చేసుకోండి. బై బై కెసిఆర్” అంటూ వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ పాలనకు ఎండ్ కార్డ్ పడబోతోంది అని జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు ఒక గిఫ్ట్ ఇస్తున్నామని షర్మిల పేర్కొన్నారు. అంతేకాదు తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే అధికార భారత రాష్ట్ర సమితికి లాభం జరుగుతుంది కాబట్టి.. అలాంటి పని చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని షర్మిల పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల ద్వారా అటు భారత రాష్ట్ర సమితి, ఇటు భారతీయ జనతా పార్టీ ఒకటే అని ప్రజలకు అర్థమైందని షర్మిల వివరించారు. భారతీయ జనతా పార్టీ పెద్దలు కేసీఆర్ అవినీతి మీద ఇంతవరకు ఒక్క చర్య కూడా తీసుకోలేదని ఆమె మండిపడ్డారు..
ఎంక్వయిరీ ఎందుకు చేయలేదు?
“ఏ స్కీం ప్రవేశపెట్టినా కెసిఆర్ అందులో అవినీతి చేస్తారు. కాలేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఒక ఏటీఎం లాగా మార్చుకున్నారు. పలు సభల్లో కేంద్ర హోం శాఖ మంత్రి కేసీఆర్ మీద విమర్శలు చేశారు. ఆయన అవినీతి మీద ఎంక్వయిరీ వేసి చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ.. పట్టించుకోలేదు” అమిత్ షా మీద షర్మిల మండిపడ్డారు. 2014, 2018 కాలంలో ప్రతిపక్షాలకు చెందిన 45 మంది ప్రజాప్రతినిధులను కెసిఆర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. అందులో 40 మంది ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ ని ఉన్నారు. “ఏ డబ్బులతో ఈ క్రతువు నిర్వహించారో కెసిఆర్ చెప్పాలి. ఇది పునరావృతం కాకూడదు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ వేదిక కాకూడదు అని” షర్మిల హితవు పలికారు. ఇలాంటి పాలిటిక్స్ చేయొద్దని కెసిఆర్ ను మేము డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు. గతంలో షూస్, ఇప్పుడు సూట్ కేస్ ను బహుమతులుగా షర్మిల పంపడం పట్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.