YS Sharmila – YS Jagan : ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. అట్లూరి ప్రియతో రాజారెడ్డి పెళ్లి నిశ్చయం అయిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్ శివార్లలోని గండిపేట గోల్కొండ రిసార్ట్ లో నిశ్చితార్థ వేడుకలను ఏర్పాటు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే అందరి దృష్టి షర్మిల సోదరుడు, ఏపీ సీఎం జగన్ పైనే ఉంది. జగన్ కార్యక్రమానికి హాజరు కాగా.. షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ కంటే విజయమ్మతో మాత్రమే చనువుగా గడపడం విశేషం.
నిశ్చితార్థ వేడుకలకు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులు అధికంగా హాజరయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నటుడు మోహన్ బాబు, విష్ణు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేత శైలజనాథ్, జెడి శీలం, ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, వివేక్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఏపీ సీఎం జగన్ మాత్రం కొద్దిసేపు మాత్రమే అక్కడ గడిపారు. సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల సమయంలో సీఎం జగన్ దంపతులు రిసార్ట్ కు చేరుకున్నారు. భార్య భారతి తో కలిసి నేరుగా ప్రధాన వేదిక వద్దకు వెళ్లారు. ముందుగా తల్లి విజయమ్మను ఆప్యాయంగా హత్తుకున్నారు. పక్కనే ఉన్న షర్మిలను పలకరించారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే షర్మిల దంపతులు అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం విశేషం. సీఎం జగన్ తో గ్రూప్ ఫోటో దిగేందుకు షర్మిలను రెండుసార్లు పిలిచినా రాలేదు. చివరకు విజయమ్మ గట్టిగా కోరడంతో మూడోసారి షర్మిల వచ్చి చేరారు. అది కూడా వరుసలో చివరిగా నిల్చుని ఫోటోలకు దిగడం విశేషం. దీంతో పొడి పొడి పలకరింతలతో జగన్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. జగన్ వెంట ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వై వి సుబ్బారెడ్డి ఉన్నారు. మొత్తానికైతే జగన్ వచ్చారు.. అలా వెళ్లిపోయారే కానీ.. ఎక్కువగా ముభావంగా ఉండిపోయారు. అటు షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్ దంపతులు సైతం పెద్దగా జగన్ ను పట్టించుకోలేదు.