Ayodhya Ram Mandir : యావత్ ప్రపంచంలో హిందువులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అపూర్వఘట్టం అయోధ్యలో మరో మూడు రోజుల్లో ఆవిష్కృతం కాబోతోంది. నూతనంగా నిర్మించిన రామ మందిరంలో రామ్ లల్లా ఫ్రాణ ప్రతిష్టకు ముహూర్తం సమీపిస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 గంటలకు బాల రాముడి ప్రాణ ప్రతిష్ట ప్రధాని నరేంద్రమోదీ చేతుల మహోజ్వల ఘట్టం ఆరంభమవుతుంది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన స్థలం అయోధ్యంలో రామ మందిరం అందుబాటులోకి రాబోతోంది.
తుది దశకు ఏర్పాట్లు..
అయోధ్య రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు దాదాపు పూర్తికావొచ్చాయి. ఆధ్యాత్మిక నగరిగా అయోధ్య విద్యుత్ కాంతుల వెలుగుల్లో విరాజిల్లుతోంది. ఇప్పటికే నిత్యం లక్షల మంది అయోధ్యను దర్శించుకుంటున్నారు. ఇక జనవరి 22న ఏడు వేల మందికి మాత్రమే వేడుకలో పాల్గొనే అవకాశం లభించింది. ఈమేరకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానాలు పంపించింది. ఇక రామాలయం ప్రారంభోత్సవం రోజు దేశవ్యాప్తంగా రెండో దీపావళి జరుపుకోవాలని హిందువులకు ఆర్‌ఎస్‌ఎస్ నేతలు పిలుపు నిస్తున్నారు. ఇంటింటా ఐదు దీపాలు వెలిగించాలని, టపాసులు కాల్చాలని, కొత్త బట్టలు ధరించాలని, దగ్గరలోని గుడికి వెళ్లి శ్రీరాముడిని దర్శించుకోవాలని సూచిస్తున్నారు.
ప్రారంభమైన ఉత్సవాలు..
ఇదిలా ఉండగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవాలు ఈనెల 15న ప్రారంభమయ్యాయి. ఆగమోక్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. 1008 హోమ గుండాలతో 33 కోట్ల దేవతలను బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించేలా 1008 మంది రుత్వికులు యాగం నిర్వహిస్తున్నారు. దీంతో వేదమంత్రోచ్ఛారణలతో అయోధ్యా నగరం మారుమోగుతోంది. ఈ క్రమంలో అయోధ్య రామాలయంలో ప్రతిష్టించే రామ్ లల్లా విగ్రహం గర్భగుడిలోకి ప్రవేశించింది.
తొలి ఫొటో ఇదే..
ఆది పురుషుడు, కోట్లాది మంది ఆరాధ్య దైవమైన రాముడి అపురూప విగ్రహ రూపాన్ని వీక్షించేందుకు హిందువులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో గర్భగుడిలో ప్రవేశించిన బాల రాముడి ఫొటోలను విశ్వ హిందూ పరిషత్ మీడియా విభాగం ఇన్‌చార్జి శరద్ శర్మ విడుదల చేశారు. గర్భగుడిలో ప్రతిష్ఠించిన అనంతరం బయటికొచ్చిన మొట్ట మొదటి ఫొటోలు ఇవి. ఈ విగ్రహం ముఖం, పైభాగాన్ని వస్త్రాలతో కప్పి ఉంచారు. ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజున వాటిని తొలగిస్తారు.
కర్ణాటక శిల్పి మలిచిన బాల రాముడు..
కర్ణాటకలోని మైసూరుకు చెందిన ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ బాలరాముడి విగ్రహాన్ని మలిచాడు. దీని ఎత్తు 51 అంగుళాలు, నల్లరాతితో శ్రీరాముడి నిలువెత్తు విగ్రహాన్ని చెక్కారు. 150 నుంచి 170 కిలోల బరువు ఉంటుందని తెలుస్తోంది. గురువారం ఈ బాలరాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి ప్రవేశపెట్టారు. ప్రత్యేక పూజలు చేశారు.