వైఎస్ షర్మిల కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఎల్లారెడ్డిగూడ, అల్మాస్ పూర్ గ్రామాల్లో పర్యటించి ప్రజలను పరామర్శించారు. కరోనా వచ్చినా పట్టించుకునే వారే లేరని దుయ్యబట్టారు. వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని పేర్కొన్నారు. అప్పులు చేసి రోడ్డున పడడానికి కారణం ప్రభుత్వమేనని తెలిపారు. ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నా బిల్లులు రాక అప్పుల పాలు కావడంపై విమర్శించారు.
ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. కరోనా బారిన పడి కుటుంబాలు కుదేలయ్యాయయని దుయ్యబట్టారు. సామాన్యుడికి రూ.10 నుంచి 20 లక్షల బిల్లు వేస్తే వారు ఇల్లు, వాకిలి తాకట్టు పెట్టారని గుర్తు చేశారు. చివరికి శవాలను తీసుకెళ్లాలన్నా బిల్లు కట్టనిదే తీసుకెళ్లనీయలేదని వాపోయారు.0
సీఎం మాత్రం ఆయనకు కరోనా సోకితే యశోదకు పోయి చికిత్స తీసుకున్నారని తెలిపారు. కానీ సామాన్యులు మాత్రం తమ ప్రాణాలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుందని చెప్పారు. కరోనా బారిన పడి మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కరోనా విజృంబిస్తున్న తరుణంలో పాఠశాలలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించడం సమంజసం కాదని చెప్పారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సూచించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్పతనం గురించి అందరికీ తెలిసిందేనన్నారు. ఆయనపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు రావాలని పేర్కొన్నారు.
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన అరుట్ల విక్రమ్ రెడ్డి కుటుంబాన్ని కరీంనగర్ జిల్లాలో పర్యటనలో భాగంగా షర్మిల పరామర్శించారు. ఎల్లారెడ్డిగూడ మండలం పదిరె గ్రామంలో ఉన్న విక్రమ్ కుటుంబసభ్యులను షర్మిల కలిశారు. వారి కటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.