YS Sharmila : వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు? ఎంపీ గానా? ఎమ్మెల్యే గానా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఆమె తప్పకుండా పోటీ చేస్తారని మాత్రం కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. వైసిపి తో పాటు జగన్ పతనాన్ని ఆమె కోరుకుంటున్నారు. దీంతో ఆమె కచ్చితంగా కడప నుంచి బరిలో దిగుతారని తెలుస్తోంది. అయితే ఎంపీగా పోటీ చేస్తారా? ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అన్నది తెలియడం లేదు. ఆమె వెంట వివేక కుమార్తె సునీత నడుస్తుండడంతో.. ఇద్దరూ బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
వైఎస్ కుటుంబానికి కడప జిల్లా పెట్టని కోట. గత నాలుగు దశాబ్దాలుగా ఆ కుటుంబానికి జిల్లా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. వైఎస్ అకాల మరణం తర్వాత.. వైసీపీని ఏర్పాటు చేసిన తరువాత కడప తో పాటు పులివెందులకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దేశంలోనే రికార్డు స్థాయిలో జగన్ కడప ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిచారు. రాజశేఖర్ రెడ్డి తొలుత ఎంపీగా పోటీ చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంపీ స్థానాన్ని తన కుటుంబ సభ్యులకు అప్పగిస్తూ వచ్చారు. తొలుత తమ్ముడు వివేకానంద రెడ్డికి, తర్వాత కుమారుడు జగన్మోహన్ రెడ్డికి, అటు వైసిపి ఆవిర్భావం తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డిలు కడప ఎంపీలుగా ఎన్నికవుతూ వచ్చారు.
ప్రస్తుతం పీసీసీ పగ్గాలు తీసుకున్న షర్మిల వైసిపి తో పాటు జగన్ పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కడప జిల్లాలో పట్టు బిగించాలని చూస్తున్నారు. కడప ఎంపీ స్థానంతో పాటు పులివెందుల అసెంబ్లీ స్థానంపై గురి పెట్టారు. అయితే షర్మిల ఎంపీ గానే పోటీ చేసే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలంటే ఈ రాష్ట్రానికి చెందిన పౌరులై ఉండాలి. లేకుంటే ఓటు అయినా ఉండాలి. కానీ షర్మిలకు హైదరాబాదులోనే ఓటు ఉంది. చిరునామా ఉంది. అయితే ఎంపీ విషయంలో ఈ నిబంధనలు ఏవి ఉండవు. భారత పౌరురాలు అయితే చాలు.అందుకే షర్మిల ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
అయితే సోదరుడు జగన్ తో ముఖాముఖిగా తలపడాలని షర్మిల భావిస్తున్నారు. అదే నిర్ణయానికి వస్తే ఆమె పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాల్సి ఉంటుంది. కానీ ఆమె స్థానికంగా ఓటర్ కాదు. ఈ రాష్ట్రంలోనే ఆమెకు ఓటు లేదు. అలాగైతే ఇక్కడ ఓటరుగా నమోదు కావాలి. అది జరగాలంటే ఆరు నెలల సమయం పడుతుంది. ఎన్నికలు చూస్తే ఒక రెండు నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఈ లెక్కన సాధ్యం కాదు. అయితే ఏపీ పౌరురాలుగా చూపేందుకు.. ఆమె ఆధార్ కార్డు బదిలీ చేస్తే సరిపోతుంది. ఈ రాష్ట్రానికి చెందిన పౌరురాలుగా తేలితే మాత్రం ఆమె అసెంబ్లీకి పోటీ చేసి చాన్స్ ఉంటుంది. మరి అందుకు తగ్గ ఏర్పాట్లు షర్మిల చేసుకుంటున్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.