కర్ర విరగకుండా ఏబీఎన్ ఆర్కేను కొట్టిన వైఎస్ షర్మిల..?

కర్ర విరగకుండా కాటువేయడానికి రెడీ అయిన పామును చంపింది వైఎస్ షర్మిల.. ఈ మాటల మంటల్లో చిక్కిపోకుండా.. ప్రత్యర్థి చేతిలో అభాసుపాలుకాకుండా అటు కుటుంబ గౌరవాన్ని.. ఇటు వ్యక్తిగత ఇమేజ్ ను కాపాడుకుంది. అన్నయ్య, సీఎం జగన్ పరపతిని, వైఎస్ఆర్ కుటుంబ పరువును కాపాడింది. ఎంతో పరిణితితో వైఎస్ షర్మిల తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో బయటపకుండా మాట్లాడిన తీరు నిజంగానే ప్రశంసించక తప్పదు. రాజకీయ పద్మవ్యూహంలో చిక్కకుండా.. ప్రత్యర్థి తన చాతుర్యంతో ఎంత వివాదాంలోకి […]

Written By: NARESH, Updated On : September 27, 2021 10:18 am
Follow us on

కర్ర విరగకుండా కాటువేయడానికి రెడీ అయిన పామును చంపింది వైఎస్ షర్మిల.. ఈ మాటల మంటల్లో చిక్కిపోకుండా.. ప్రత్యర్థి చేతిలో అభాసుపాలుకాకుండా అటు కుటుంబ గౌరవాన్ని.. ఇటు వ్యక్తిగత ఇమేజ్ ను కాపాడుకుంది. అన్నయ్య, సీఎం జగన్ పరపతిని, వైఎస్ఆర్ కుటుంబ పరువును కాపాడింది. ఎంతో పరిణితితో వైఎస్ షర్మిల తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో బయటపకుండా మాట్లాడిన తీరు నిజంగానే ప్రశంసించక తప్పదు. రాజకీయ పద్మవ్యూహంలో చిక్కకుండా.. ప్రత్యర్థి తన చాతుర్యంతో ఎంత వివాదాంలోకి లాగుదామని చూసినా ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్తగా మాట్లాడిన తీరు చూస్తే అభినందించకుండా ఉండలేరు..

అపర మేధావిగా.. పార్టీలను నడిపించే జర్నలిస్ట్ వ్యూహకర్తగా పేరున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ (ఆర్కే).. తన పగవాడి కూతురు వైఎస్ షర్మిలను తీసుకొచ్చి ఇంటర్వ్యూకు ప్లాన్ చేసినప్పుడే ఏదో కొంపలు మునిగే పని చేపట్టాడని వైఎస్ అభిమానులు ఆందోళన చెందారు. ‘‘వైఎస్ జగన్ తో విభేదాలు.. కుటుంబం ఆస్తి గొడవలు.. తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టింది.. భర్త అనిల్ కుమార్ తో ప్రేమ పెళ్లి, విజయమ్మకు అన్యాయం, వైఎస్ వివేకా హత్య ఇలా..’’ ఎన్నో చిక్కుమడులు లాంటి ప్రశ్నలను అడిగి ఏబీఎన్ ఆర్కే వ్యూహాత్మకంగా వైఎస్ షర్మిలను ఇబ్బంది పెట్టాడు.కానీ నవ్వుతూనే వాటన్నింటిని వివాదాలకు దూరంగా షర్మిల సమాధానం ఇచ్చిన తీరు హ్యాట్సాఫ్ అనే చెప్పాలి..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలి.. ఏపీ సీఎం జగన్ సోదరిగా.. తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్ షర్మిల. ఇక్కడి నిరుద్యోగ సమస్యపై ఎలుగెత్తి చాటుతూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ , జగన్ అంటే వ్యతిరేకించే టీడీపీ అనుకూల ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ తాజాగా ఆమెతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో షర్మిల వ్యక్తిగత, రాజకీయ అంశాలపై సీరియస్ ప్రశ్నలు అడిగారు.

-జగన్ జైలుకెళితే సీఎంగా షర్మిలకు చాన్స్
జగన్ ఒకవేళ అక్రమాస్తుల కేసుల్లో జైలుకు వెళితే నెక్ట్స్ సీఎం ఎవరన్న ప్రశ్నకు షర్మిల ఆసక్తికరంగా స్పందించారు. వైసీపీ పార్టీ దాన్ని నిర్ణయిస్తుందని.. వారు సమావేశమై ఎవరిని నిర్ణయిస్తే వారే సీఎం అవుతారని షర్మిల వ్యూహాత్మంగా సమాధానమిచ్చింది.. సోదరుడు జగన్ గెలుపు కోసం ఆయన కృషి చేశానని షర్మిల తెలిపారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టానన్నారు. కానీ ఇప్పటికీ తనకు వైసీపీలో కనీసం సభ్యత్వం లేదని షర్మిల చెప్పుకొచ్చారు. ఇప్పుడు తన అవసరం వైసీపీకి లేదని.. అన్నయ్య సీఎం అయ్యాక.. వైసీపీ పాలన కొనసాగుతున్న సమయంలో తాను చేయడానికి ఏముంటుందని అభిప్రాయపడింది. జగన్ కొన్ని కేసుల నేపథ్యంలో సీఎంగా ఉండలేని పరిస్థితి వస్తే వారి పార్టీ పరంగా.. నిర్ణయం తీసుకుంటారని షర్మిల సమాధానం దాటవేశారు. వారి కుటుంబీకులకే పార్టీ పదవి దక్కాలని లేదని స్పష్టం చేశారు.

-జగన్ తో ఆస్తి గొడవలపై షర్మిల స్పందన
ఇక వైఎస్ఆర్ ఉన్నప్పుడు పోగైన ఆస్తిపై సగం వాటా మీకు దక్కుతుంది కదా అని ఏబీఎన్ ఆర్కే ఫిటింగ్ పెట్టగా.. షర్మిల అన్నయ్యతో గొడవ పడనని.. ఆస్తులు ఎటుపోతాయి.. సామారస్యంగా మాట్లాడుకొని తీసుకుంటాం.. అంటూ మా మధ్య ఆస్తి గొడవలకు తావు లేదని షర్మిల ఎక్కడా దొరక్కుండా సమాధానమిచ్చారు.

-భర్త అనిల్ తో ప్రేమ.. పెళ్లిపై స్పందన
సికింద్రాబాద్ లోని ఓ దాబాలో భర్త అనిల్ ను చూశానని…మిత్రులతో కలిసి వెళ్లినప్పుడు పరిచయం ఏర్పడిందని వివరించారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పలేనన్నారు. అతడే తనకు ముందుకు ప్రేమ ప్రపోజల్ చేశాడని షర్మిల చెప్పుకొచ్చింది.. ఆ తర్వాత ఒప్పుకొని పెళ్లి చేసుకున్నామన్నారు. వాళ్లు బ్రాహ్మణులు వాళ్ల పద్ధతులు వేరు అని అన్నారని.. కానీ తాను మాత్రం పట్టుదలతో పోరాడానని వివరించారు.

ప్రతీ అంశంలోనూ ఏబీఎన్ ఆర్కే వైఎస్ ఫ్యామిలీని విలన్ గా చూపించాలని షర్మిలపై ఎన్నో ప్రశ్నలు సంధించారు. కొండను తవ్వడానికి ప్రయత్నించిన ఏబీఎన్ ఆర్కే ఈ ప్రయత్నంలో ‘ఎలుక’నే పట్టేశాడు. షర్మిల మాత్రం ఎక్కడా వెనక్కి నోరుజారకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇదో అద్భుతమైన ఇంటర్వ్యూ అనే చెప్పాలి. షర్మిలకు కూడా ఇది పెద్ద మైలేజ్ తెచ్చింది. ఇది ఎంతో వైరల్ అవుతుందని ఆమెకు తెలుసు. ఈ క్రమంలోనే షర్మిల వ్యవహరించిన తీరు అభినందనీయం అని చెప్పాలి.

శత్రువైనా సరే ఏబీఎన్ ఆర్కే ఇంటర్వ్యూకు వచ్చిన షర్మిల.. ఎక్కడా టంగ్ స్లిప్ కాకుండా ఇటు కుటుంబ మర్యాదను.. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంది. అన్నయ్య సీఎం జగన్ విషయంలోనూ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు. బాధ్యాయుతంగా మాట్లాడింది. పదే పదే జగన్ ను తిట్టిద్దామని ఏబీఎన్ ఆర్కే ఎంతో ప్రయత్నించారు. జగన్ పరిపాలన సరిగా లేదని ప్రశ్నించారు. అయితే షర్మిల మాత్రం ప్రజలు ఐదేళ్లు సమయం ఇచ్చారని.. పరిపాలన బాగాలేకపోతే ప్రజలే నిర్ణయిస్తారని చక్కటి సమాధానం చెప్పింది. వైఎస్ ఫ్యామిలీలో గొడవలు , విభేదాలు లేవని షర్మిల చెప్పిన తీరు ఆకట్టుకుంది.

తెలంగాణ రాజకీయానికి వస్తే బలమైన కేసీఆర్ పై వ్యతిరేకత ఉందని.. ఇక్కడ ప్రతిపక్షం లేకనే ఆయనను గెలిపిస్తున్నారని షర్మిల వివరించింది. పీసీసీ చీఫ్ రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉందని.. ఆయనను ఎప్పుడైనా కట్ చేసే ఆప్షన్ కేసీఆర్ కు ఉందని వివరించారు.ఇక బీజేపీ, బండి సంజయ్ మాటలకే కానీ.. చేతల్లో లేరని షర్మిల విమర్శించింది. తెలంగాణలో ప్రతిపక్షం లేకనే కేసీఆర్ గెలుస్తున్నాడని.. ఆయన లోటుపాట్లు ఎత్తిచూపి రాజకీయంగా విజయం సాధిస్తామని చెప్పుకొచ్చింది.

‘‘ఇక రాజ్యసభ సభ సీటు ఇస్తానని.. జగన్ మోసం చేశాడట కదా?’’ అన్న ప్రశ్నకు షర్మిల సూటిగా సమాధానం ఇచ్చారు. ఇస్తానని చెప్పలేదు.. నన్ను అడగలేదు.. అలాంటి ప్రస్తావన రాలేదని జగన్ ను వెనకేసుకొచ్చింది షర్మిల. ఇక వైఎస్ వర్థంతి వేళ జగన్-షర్మిల మాట్లాడుకోలేదన్నది తప్పు అని.. ప్రార్థన వేళ అంతా సైలెంట్ గా ఉంటామని షర్మిల వివరించారు. తర్వాత లంచ్ మీటింగ్ లో తామంతా కలిసి భోజనం చేశామని వివరించింది. జగన్ సైతం తనతో అక్కడ మాట్లాడాడని.. తమ మధ్య మునుపటి అనుబంధమే ఉందని తెలిపింది.

జగన్, వైసీపీకి తాను తెలంగాణలో రాజకీయం చేయడం ఇష్టం లేదని.. అందుకే తమకు షర్మిలతో సంబంధం లేదని వారు ప్రకటించారని   చెప్పుకొచ్చింది. అదే తనను కొంత బాధపెట్టిందని షర్మిల వివరించింది. వారు పిలిచినప్పుడల్లా వచ్చి వైసీపీ కోసం పనిచేశానని..పాదయాత్ర చేశానని  వివరించింది.

వైెఎస్ వివేకానందరెడ్డి మరణం మా ఇంట్లో అందరినీ బాధపెట్టిందని..ఆయన కూతురు సునీతకు అండగా కుటుంబ సభ్యులమంతా నిలబడ్డామని షర్మిల పంచుకుంది. మా కుటుంబం అంతా ఒక్కటేనని.. ఇందులో కలిసికట్టుగా ముందుకువెళతామని వివరించింది. వైఎస్ వివేకా హత్యపై షర్మిల తన అన్నయ్య జగన్ పై విమర్శలు చేస్తుందనుకున్న ఆర్కేకు ఆ అవకాశం ఇవ్వకుండా సెంటిమెంట్ తో షర్మిల ఆ ఇష్యూను ముగించడం విశేషం.

ఇక జగన్ సంపాదించిన ఆస్తి మీకు ఇస్తారా? అన్న ప్రశ్నకు సైతం షర్మిల వ్యూహాత్మకంగా సమాధానమిచ్చారు.. ‘ఎక్కడికి పోతుంది?’ అంటూ దాటవేశారు. లోపల ఎన్ని గొడవలు ఉన్నా కూడా షర్మిల మాత్రం అన్నయ్య జగన్ కు అండగానే నిలబడ్డారు. డిప్లామాటిక్ గా వైఎస్ షర్మిల సమాధానాలిచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో గొడవలున్నాయని ఆర్కే ఎత్తిచూపడానికి చేసిన ప్రయత్నాలన్నింటిని షర్మిల తుత్తునియలు చేయడం విశేషం. తద్వారా జగన్ , వైఎస్ఆర్ పరువును కాపాడింది. ఇటు తన వ్యక్తిగత ఇమేజ్ ను ఈ ఇంటర్వ్యూ ద్వారా పెంచుకుందనే చెప్పాలి.

ఇక సీఎం జగన్ జైలుకెళితే అన్న ప్రశ్నకు జైలుకు వెళ్లడు అని షర్మిల సమాధానం చెప్పలేకపోయింది. తద్వారా అన్నయ్యపై ఉన్న కేసులను షర్మిల నిర్ధారించినట్టైంది. నెక్ట్స్ సీఎం ఎవరన్న దానిపై పార్టీ నిర్ణయిస్తుందన్న ఒక్క విషయంలో మాత్రమే షర్మిల కాస్త తడబడింది. జగన్ అక్రమాస్తులు, కేసుల అన్న విషయంలో మాత్రం ఏబీఎన్ ఆర్కే సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. మిగతా అన్నింట్లోనూ షర్మిల తబడకుండా బాధ్యతాయుతంగా చెప్పింది.

ఈ ఇంటర్వ్యూ ద్వారా వైఎస్ కుటుంబంలోని లోటుపాట్లను బయటపెట్టి వీధిన పడేయాలన్న ఏబీఎన్ ఆర్కే ప్రయత్నం బెడిసికొట్టిందనే చెప్పాలి. షర్మిల ఈ ఇంటర్వ్యూలో అటు పుట్టింటి గౌరవం.. మెట్టినింటి గౌరవం.. అన్నయ్య జగన్ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా చేయలేదు. కుటుంబాన్ని బజారుకీడ్చలేదు. ఎంతో డిప్లమాటిక్ గా మాట్లాడింది. జగన్ ను తిట్టించాలన్న ఆర్కే ప్రయత్నాలు నెరవేరలేదు.

-వైఎస్ షర్మిలతో ఏబీఎన్ ఆర్కే ఇంటర్వ్యూ పూర్తి వీడియో..