YS Sharmila: వైయస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన బయటకు వచ్చింది. నూతన సంవత్సర సందర్భంగా వైఎస్ షర్మిల ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. వైయస్ షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి కొంతకాలంగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడ ఆయన చట్నీస్ రెస్టారెంట్ అధినేత ప్రసాద్ మనవరాలు ప్రియ తో కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే వీరిద్దరూ తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దలకు చెప్పడం.. వారు అంగీకరించడం వెంట వెంటనే జరిగిపోయాయి. దీంతో ఇదే విషయాన్ని ఇటీవల షర్మిల అంతరంగికులకు చెప్పడంతో ఒక్కసారిగా ఆ వార్త బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత వైయస్ విజయలక్ష్మి ప్రియని కలిసి ఒక చీరను బహుమతిగా ఇచ్చింది.
ఇక ఇటీవల వైయస్ రాజారెడ్డి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. తన కాలేజీలో జరిగిన స్నాతకోత్సవానికి తన తల్లిదండ్రులను పిలిపించుకున్నాడు. వారి సమక్షంలో కాలేజీ యాజమాన్యం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నాడు.ఇదే సమయంలో షర్మిల కూతురు అంజలి రెడ్డి కూడా తన గ్రాడ్యుయేషన్ పట్టాను అందుకుంది. ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమాలలో షర్మిల పంచుకున్నారు. ఆ స్నాతకోత్సవ కార్యక్రమానికి భర్త అనిల్, తల్లి విజయలక్ష్మితో కలిసి హాజరయ్యారు. ఆ సందర్భంగా తీసిన ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. వైయస్ రాజారెడ్డికి సామాజిక మాధ్యమాల వేదికగానే శుభాకాంక్షలు కూడా తెలిపారు షర్మిల.
గ్రాడ్యుయేషన్ ఎలాగూ పూర్తి కావడంతో షర్మిల తన కుమారుడికి సంబంధించిన పెళ్లి ప్రకటనను అధికారికంగా సోమవారం ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా తన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనవరి 18న రాజారెడ్డికి ప్రియకు ఎంగేజ్మెంట్, ఫిబ్రవరి 17న వివాహం జరుపుతామని ఆమె ప్రకటించారు. వివాహ ఆహ్వాన పత్రికను మంగళవారం ఇడుపులపాయలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఉంచుతామని ఆమె వివరించారు.. తన కుమారుడికి కాబోయే కోడలికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ వివాహానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ని ఆహ్వానిస్తామని షర్మిల ఇటీవల తన అంతరంగీకులతో చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు మధ్య వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వివాహానికి ఆయనను ఆహ్వానిస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపడుతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో షర్మిలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటీలు పడ్డారు. అయితే ఇటీవల షర్మిలను లక్ష్యంగా చేసుకొని ఏపీ అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. షర్మిల రాజకీయ అడుగులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.