తెలంగాణలో పార్టీలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక్కడ మరో పార్టీ జీవం పోసుకుంది. వైఎస్ ఆర్ వారసురాలిగా షర్మిల వైఎస్సార్ టీపీ పేరుతో పార్టీ స్థాపించారు. అప్పుడే సమస్యల సాధనకు నడుం బిగించారు. నిరుద్యోగుల సమస్యపై పోరాడేందుకు నిర్ణయించుకున్నారు. ప్రజాసంక్షేమమే ఎజెండాగా ముందుకు వెళుతున్నారు. నిరుద్యోగ సమస్యపై ప్రతి మంగళవారం నిరాహార దీక్ష చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆమె పర్యటనలో జనం కానరాకపోవడంతో పార్టీ విస్తరణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో పార్టీ పెట్టిన మొదట్లో అభిమానులు, నాయకులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని భావించారు. అప్పుడు పలువురు నేతలు హడావిడి చేశారు. కానీ ప్రస్తుతం నాయకులు లోటస్ పాండ్ కు రావడం లేదు. దీనికి కారణం షర్మిల ప్రసంగాలే అని తెలుస్తోంది. ఆమె మాటల్లో పస లేకపోవడంతో స్పందన రావడంలేదు. దీంతో నాయకుల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. షర్మిల మాటల్లో పొంతన ఉండడం లేదు. వాటికి సరైన స్పందన కానరావడం లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి నేతలెవరు చేరడం లేదు.
షర్మిల చేసే పర్యటనలో జనం కానరావడం లేదు. దీంతో నాయకుల్లో ఆశ్చర్యం కలుగుతోంది. జిల్లాల పర్యటనలో ప్రజలు పెద్దగా రావడం లేదు. కనీసం 50 మంది కూడా కనిపించడం లేదు. నిరుద్యోగ సమస్యపై పోరాడుతున్నా నిరుద్యోగులు సైతం సమావేశాల్లో కనిపించడం లేదు. యువత కూడా పట్టించుకోకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి. జనసమీకరణలో నేతలు ఫెయిలయినట్లు చెబుతున్నారు. దీంతో నేతలు సరిగా పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైఎస్సార్ టీపీలో చేరికలపై మొదట్లో ప్రచారం సాగినా తరువాత ఎవరు ముందుకు రావడం లేదు. పార్టీలో చేరికలుంటాయని భావించినా అవి ఆచరణలో కనిపించడం లేదు. పార్టీ ఆవిర్భావ సమయంలో కూడా పెద్దగా జనం లేకపోవడంతో నేతల్లో అయోమయం నెలకొంది. పార్టీ మనుగడపై ప్రభావం చూపే అవకాశం ఏర్పడింది. భవిష్యత్ అంధకారంగా మారే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.