YS Sharmila : ష‌ర్మిల ఉనికి పాట్లు?

వైఎస్ ష‌ర్మిల గ్రాండ్ గా ఫంక్ష‌న్ చేసి పార్టీని ప్రారంభించారు. ఆ కార్య‌క్ర‌మానికి ముందు మూడు రోజులు.. త‌ర్వాత మూడు రోజులు హ‌డావిడి న‌డిచింది. సీన్ క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆ పార్టీ చ‌ర్చ‌ల్లోనే ఉండ‌ట్లేదు. ప్ర‌ధాన పార్టీల‌న్నీ వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో.. కౌంట‌ర్లు, ఎన్ కౌంట‌ర్ల‌తో రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలో దూసుకెళ్తుంటే.. ష‌ర్మిల జాడ ఎక్క‌డా క‌నిపించ‌ట్లేదు. ఆమె తీసుకున్న ‘మంగ‌ళ‌వారం దీక్ష‌ల’ కార్య‌క్ర‌మంలో భాగంగా.. ఇవాళ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో దీక్షకు పూనుకున్నారు. ఆమె దీక్ష‌ల‌కు సైతం […]

Written By: Bhaskar, Updated On : August 18, 2021 12:31 pm
Follow us on

వైఎస్ ష‌ర్మిల గ్రాండ్ గా ఫంక్ష‌న్ చేసి పార్టీని ప్రారంభించారు. ఆ కార్య‌క్ర‌మానికి ముందు మూడు రోజులు.. త‌ర్వాత మూడు రోజులు హ‌డావిడి న‌డిచింది. సీన్ క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఆ పార్టీ చ‌ర్చ‌ల్లోనే ఉండ‌ట్లేదు. ప్ర‌ధాన పార్టీల‌న్నీ వ్యూహ ప్ర‌తివ్యూహాల్లో.. కౌంట‌ర్లు, ఎన్ కౌంట‌ర్ల‌తో రాజ‌కీయ ర‌ణ‌క్షేత్రంలో దూసుకెళ్తుంటే.. ష‌ర్మిల జాడ ఎక్క‌డా క‌నిపించ‌ట్లేదు. ఆమె తీసుకున్న ‘మంగ‌ళ‌వారం దీక్ష‌ల’ కార్య‌క్ర‌మంలో భాగంగా.. ఇవాళ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో దీక్షకు పూనుకున్నారు. ఆమె దీక్ష‌ల‌కు సైతం స్పంద‌న మామూలుగానే ఉండ‌డంతో.. ష‌ర్మిల (YS Sharmila) ఉనికి కోసం పాట్లు ప‌డుతున్నారా? అనే చ‌ర్చ సాగుతోంది.

విడుద‌ల‌కు ముందు సినిమా గురించి ఎన్ని విష‌యాలైనా చెప్పొచ్చు.. కానీ, విడుద‌లైన‌ త‌ర్వాతే అందులో విష‌యం ఎంత ఉంద‌న్న‌ది తెలుస్తుంది. ఆ విష‌యం మీద‌నే సినిమా భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంటుంది. రాజ‌కీయ పార్టీ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. పార్టీ ప్ర‌క‌ట‌న ముందు వ‌ర‌కూ ఏం జ‌రుగుతుంది? ఎలా జ‌రుగుతుంది? అధినేత ఎలా నడిపిస్తారు? ప్రజలు ఎలా స్వీకరిస్తారు? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియ‌దు. కానీ.. పార్టీని ప్రారంభించిన త‌ర్వాత ఒక్కొక్క‌టిగా లెక్క‌లు తేలుతుంటాయి.

ఇప్పుడు ష‌ర్మిల పార్టీ (YSRTP) కూడా ఇలాంటి ప‌రిస్థితుల్లోనే ఉంద‌ని అంటున్నారు. ప్రారంభోత్స‌వం త‌ర్వాత‌.. పార్టీని నిల‌బెట్టేందుకు ష‌ర్మిల తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. పార్టీలో చేరికలు ఉంటాయ‌నే ప్ర‌చారం సాగిన‌ప్ప‌టికీ.. అలాంటిదేమీ క‌నిపించ‌ట్లేదు. మీడియా స‌మావేశాల్లో, సామాజిక మాధ్యమాల్లో కేసీఆర్‌, కేటీఆర్ పై ష‌రామామూలు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. వీటిని కూడా జ‌నాలు లైట్ తీసుకుంటున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆ మ‌ధ్య కేటీఆర్ అంటే ఎవ‌రు? అని అడ‌గడం ద్వారా మాట‌ల యుద్ధానికి ప్ర‌త్య‌ర్థుల‌ను ఆహ్వానించారు కూడా. కానీ.. ఎవ్వ‌రూ ష‌ర్మిల‌ను ప‌ట్టించుకోలేదు. ఇక, ఇప్పుడు మొత్తం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌, ద‌ళిత బంధు వంటి అంశాల చుట్టూనే రాష్ట్ర రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ష‌ర్మిల పార్టీ ఈ ఎన్నిక‌లో పోటీ చేయ‌బోద‌ని చెప్పారు. ప్ర‌ధాన పోరు ఈట‌ల‌-కేసీఆర్ మ‌ధ్య‌నే అన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడే పుట్టిన పార్టీని మ‌ల్ల‌యోధుల స‌మ‌రంలోకి దించ‌డం ఎందుకులే అనుకున్నారేమో.. వ్య‌క్తిగ‌త పంచాయితీలాంటి ఈ ఉప పోరుకు తాము దూరంగా ఉంటామ‌ని చెప్పి సైడైపోయారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ష‌ర్మిల‌కు ఎంచుకోవ‌డానికి పొలిటిక‌ల్ టాపిక్ కూడా లేకుండా పోయింది. క‌నీసం వారానికి ఒక‌సారైనా చ‌ర్చ‌లో ఉండేందుకు మంగ‌ళ‌వారం దీక్ష‌లు కొన‌సాగిస్తున్నారు. ఇవాళ‌ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని గూడూరు మండ‌లం గుండెంగ గ్రామంలో ఆమె దీక్ష చేప‌ట్టారు. సమకూర్చున్న వారు తప్ప.. పెద్దగా జనం నుంచి స్పందన లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. ప్ర‌స్తుతానికైతే ష‌ర్మిల ఉనికి పాట్లు ప‌డుతున్న విష‌యం అర్థమవుతోందని అంటున్నారు. ఆమె పాద‌యాత్ర చేస్తాన‌ని అప్ప‌ట్లో ప్ర‌క‌టించారు. మ‌రి, అది ప్రారంభిస్తే.. ఏమైనా మార్పు వ‌స్తుందేమో చూడాలి.