YS Sharmila- MLC Kavitha: వారిద్దరూ ప్రభావవంతమైన కుటుంబాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని, లక్షణాలను పుణికిపుచ్చుకున్న మహిళా మణులు. కానీ ఇద్దరిదీ ఒకటే పంధా. తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు. ఆ ఇద్దరు మహిళలు ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు కవిత, మరోకరు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి తనయ వైఎస్.షర్మిల

ఒకే పంధాతో పోరాటం..
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు సీఎం కేసీఆర్ తనయ కవిత, వైఎస్సార్ తనయ షర్మిల చుట్టే తిరుగుతున్నాయి. కేంద్రంపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదని కేసీఆర్ బిడ్డ కవిత చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటంలోనూ తాను వెనకడుగు వేయనని షర్మిల తేల్చి చెబుతున్నారు. పోరాట పంధాలో ఇద్దరిదీ ఇప్పుడు ఒకేదారిగా కనిపిస్తుంది. అయితే కవిత పోరాడుతున్నది కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై, షర్మిల పోరాడుతున్నది మాత్రం కవిత తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్‌పై. తమ పోరాటానికి ఎవరి సహకారం అవసరం లేదని ముందుకు వెళ్తున్న పరిస్థితి వారిద్దరి లోనూ కనిపిస్తుంది.
పాదయాత్ర అనుమతి కోసం షర్మిల..
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టి, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, స్థానిక నాయకుల పనితీరుపై విరుచుకుపడ్డారు షర్మిల. దీంతో కేసీఆర్ సర్కార్‌లో ఎక్కడో వణుకు మొదలైంది. ప్రభుత్వం, పాలకుల పరువు బజారుకీడుస్తుందని, మంత్రులు, ఎమమ్మెల్యేల ఇమేజ్ డ్యామేజ్ చేస్తుందని భావించిన టీఆర్‌ఎస్ సర్కార్ షర్మిలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోంది. పాదయాత్రకు అనుమతి నిరాకరించి, ఎక్కడికక్కడ వైయస్సార్ తెలంగాణ పార్టీ నేతలపై కేసులు పెట్టి నిర్భందకాండ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు షర్మిల. తన పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు తెలంగాణ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేస్తున్నారు.
మడమ తిప్పనంటున్న షర్మిల
షర్మిల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రధాని నరేంద్రమోదీ వరకు చేరి, ఆయన నేరుగా షర్మిలకు ఫోన్ కూడా చేశారని ప్రచారం జరుగుతోంది. ఇక రాష్ట్రంలోనూ షర్మిలపై టీఆర్‌ఎస్ నాయకులు మూకుమ్మడి దాడి చేస్తున్నా ఆమె పోరాటం కొనసాగిస్తున్నారు. తనను ఎంత తొక్కేసే ప్రయత్నం చేసినా.. కేసీఆర్‌పై తాను చేస్తున్న పోరాటం నుంచి మడమ తిప్పనని షర్మిల తేల్చి చెబుతున్నారు.

భయపడేది లేదంటున్న కవిత..
వైఎస్.షర్మిల తరహాలోనే ఎమ్మెల్సీ కవిత కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు నోటీసులిచ్చి విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు, ఎన్ని దాడులు చేసినా తాను వెనుకడుగు వేసేది లేదంటునానరు. ప్రతిపక్షాలు ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో కవితను ఎంత టార్గెట్ చేసినా ఆమె తన పోరాటం కొనసాగిస్తున్నారు. సోమవారం నిర్వహించిన తెలంగాణ జాగృతి ఎగ్జిక్యూటివ్ సమావేశంలో దాడులు చేసినా వెనక్కి తగ్గమని మరోమారు స్పష్టం చేశారు. దాడులు చేస్తే తెలంగాణ ఆడబిడ్డల కళ్ల నుంచి నీళ్లు రావని, నిప్పులు వస్తాయంటూ భారీ డైలాగ్ కొట్టారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్న తమను, కేంద్రంలోని మోదీ∙ప్రభుత్వం అణచివేసే ప్రయత్నం చేస్తుందని చెబుతున్న కవిత, అణచివేతకు భయపడేది లేదని స్పష్టం చేశారు.