తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టామని వైఎస్ షర్మిల అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ర్టంలో పరిస్థితులు లేవని పేర్కొన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్పించిందని వివరించారు. రాష్ర్ట ప్రజలను వైఎస్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. ఆయన మరణం తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని తెలిపారు.
ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణపై ప్రేమలేదా అని ప్రశ్నించారు. తెలంగాణకు వ్యతిరేకమని నేనెప్పుడు చెప్పలేదన్నారు. సీఎం కేసీఆర్ మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో మహిళలకు చోటు లేదని చెప్పారు. కేటీఆర్ మహిళలంటే వ్రతాలు చేసుకోవాలని చెప్పారన్నారు. ఇప్పుడు నేను వ్రతమే చేస్తున్నానని చెప్పారు.
ఏపీ జగన్ పై అలిగి నేను పార్టీ పెట్టానడం సరికాదన్నారు. అలిగితే మాట్లాడడం మానేస్తారు కానీ పార్టీలు పెడతారా అని ప్రశ్నించారు. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే అన్నారు. రాజన్న రాజ్యం రాకుంటే ప్రజలే తిరుగుబడతారన్నారు. జగన్ , నేను రెండు ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడు నిర్లక్ష్యం వహించేది లేదని పేర్కొన్నారు.
ప్రజల బాగోగులు పట్టించుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని అన్నారు. రాష్ర్టంలో ప్రస్తుతం దొరల పాలన నడుస్తుందన్నారు. నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. హుజురాబాద్ ఉప ఎన్నిక కేవలం పగ, ప్రతీకారాల కోసమే అని అభివర్ణించారు. వైఎస్ లాగే పాదయాత్ర చేసి ప్రజల ఆశీస్సులు పొందుతానని చెప్పారు.