
సినిమా రిలీజ్ అవుతోందంటే.. ముందు ఎంత హడావిడి అయినా చేయొచ్చు. లక్షలు, కోట్లు ఖర్చు చేసి ప్రచారం భారీగా నిర్వహించొచ్చు. రికార్డులు తిరగరాయబోతోందని చెప్పించవచ్చు.. అదరహో అని సమీక్షలూ రాయించవచ్చు. కానీ.. ఇదంతా మొదటి రోజు మొదటి ఆటవరకే. అసలు సినిమాలో ఉన్న సరుకు ఎంత అన్నది సాయంత్రం కల్లా తేలిపోతుంది. షర్మిల కూడా తెలంగాణలో పార్టీని రిలీజ్ చేశారు. ఎంత వరకు ముందుగా ప్రచారం చేయగలరో అంతా చేశారు. భారీగా ఖర్చు చేసి పార్టీని లాంఛ్ చేశారు. ఆ ఘట్టం ముగిసింది. ఇప్పుడు పార్టీని జనాల్లోకి తీసుకెళ్లడం ఎట్లా? ఇదే.. ఇప్పుడు ఆమెకు చిక్కులు తెచ్చిపెడుతోందని సమాచారం.
తాను తెలంగాణ బిడ్డనని, ఈ నీళ్లు తాగానని, ఇక్కడే పుట్టానని చాటుకునేందుకు షర్మిల తెగ ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఎవ్వరూ పట్టించుకున్నట్టుగా కనిపించట్లేదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ఆమెను.. పొరుగు రాష్ట్ర నేతగానే చూస్తున్నారని అంటున్నారు. సభలు, సమావేశాలకు జనాన్ని తెప్పించుకుంటున్నారు తప్ప.. జనం, నాయకులు ఎవ్వరూ ఆమె పార్టీవైపు చూడట్లేదని అంటున్నారు విశ్లేషకులు.
వైఎస్ తెలంగాణకు వ్యతిరేకి అన్నది అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే.. హైదరాబాద్ రావడానికి వీసా తీసుకోవాల్సి వస్తుందని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఆయన బతికి ఉంటే.. తెలంగాణ వచ్చేది కాదు అని ఎంతో మంది ఇప్పటికీ అంటారు. అలాంటి రాజశేఖర రెడ్డి ఫొటోను ముందు పెట్టుకొని, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల రావడాన్ని చూసి కొందరు నవ్వుకుంటున్నారు.
అంతేకాదు.. ఒకవేళ షర్మిల పార్టీ పెట్టాల్సి వస్తే.. ఈమె సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి కదా? అక్కడ వదిలేసి పొరుగు రాష్ట్రం వచ్చి పార్టీ పెట్టడం ఏంటనే ప్రశ్న కూడా ఉంది. పోనీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పెట్టిందని సరిపెట్టుకోవడానికి కూడా లేదు. కేవలం.. తెలంగాణకు వచ్చి, తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్ ఫొటోతో పార్టీ పెడితే ఎలా వర్కవుట్ అవుతుందని ప్రశ్నిస్తున్నారు. జనాలు ఎలా నమ్ముతారని అడుగుతున్నారు.
ఈ కారణంగానే.. ఆమె పార్టీలో చేరేందుకు నేతలు కూడా ముందుకు రావట్లేదట. కేవలం ఖమ్మం, నల్గొండ వంటి రెండు మూడు జిల్లాల్లో అనివార్యమైన ఒకరిద్దరు నేతలు తప్ప.. షర్మిల పార్టీ వైపు ఎవ్వరూ చూడట్లేదని సమాచారం. దీంతో.. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారట షర్మిల. పార్టీనైతే ప్రారంభించాం కానీ.. దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎలా అని మదన పడుతున్నారట. మొత్తంగా షర్మిలను పరాయి రాష్ట్రానికి చెందిన నేతగానే చూస్తుండడంతో.. ఆమె పాదయాత్ర చేసినా ఉపయోగం ఉండబోదని చెబుతున్నారు. మరి, రాబోయే రోజుల్లో షర్మిల ఏం చేస్తారో చూడాలి.