YS Sharmila – Mynampally Hanumanth Rao: తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పుతోంది. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ 115 నియజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి రేసులో ముందు వరుసలో ఉంది. ఆ తర్వాతి స్థానంలో నిలిచేందుకు బీజేపీ కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీని ఢీకొట్టేందుకు సై అంటోంది. ఇందులో భాగంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ వేగం పెంచింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ వార్ రూమ్‌లో ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ సమావేశం కొనసాగింది. 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. 70 నియోజకవర్గాల్లో సింగిల్ నేమ్‌లను ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ డిసైడ్ చేసిందని సమాచారం.
నెలాఖరుకు తొలి జాబితా
ఈ నెలాఖరు వరకు తొలి జాబితా విడుదలకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. ఈ జాబితాలో సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల్లో బలమైన నేతలకు స్థానం కల్పించారు. 35 నియోజకవర్గాల్లో ఇద్దరు అభ్యర్థులు బలంగా పోటీ పడుతున్నట్లు గుర్తించారు. మిగతా చోట్ల ముగ్గురు లేదా నలుగురు అభ్యర్థుల పోటీ పడుతున్నారు. టికెట్ దక్కని నేతలకు వారి ప్రాధాన్యతలను బట్టి ఏఐసీసీ పెద్దలు నచ్చ చెప్పాలని నిర్ణయించారు. టికెట్ దక్కని వారికి పార్టీ అధికారంలోకి వచ్చాక పలు అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
టెన్ జన్‌పథ్ బాటలో..
ఈ క్రమంలో ఎమ్మెల్యే టికెట ఆశావహులతోపాటు, పార్టీ పదవులు ఆశిస్తున్న నేతలు కూడా ఢిల్లీ బాట పడుతున్నారు. అందరి దారి టెన్ జన్‌పథ్‌వైపే సాగుతోంది. ఆశావహులు పైరవీలు చేస్తుండగా, టికెట్ రాదని తెలిసిన వారు పార్టీ పదవులైనా ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు.
ఢిల్లీలో ‘మైనంపల్లి’..
మరోవైపు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కొడుకు రోహిత్‌రావుతో కలిసి శనివారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాజస్థాన్ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఈమేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. అనంతరం ఆయన ఢిల్లీ వెళ్లారు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రోహిత్‌రావుకు మల్కాజ్‌గిరి టికెట్, హన్మంతరావుకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
షర్మిల కూడా..
వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్.షర్మిల కూడా ఢిల్లీ వెళ్లారు. ఇటీవల హైరదబాద్‌కు కాంగ్రెస్ నేతలు వచ్చినప్పుడే రాహుల్‌తో సమావేశం కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అపాయింట్‌మెంట్ రద్దయింది. ఈ క్రమంలో కాంగ్రెస్ షర్మిలను సైడ్ చేస్తున్నట్లు ప్రచారం జరగడంతో చివరి ప్రయత్నంగా ఆమె మరోమారు ఢిల్లీ వెళ్లారు. పార్టీ విలీనంతోపాటు పాలేరు టికెట్ కోసం ఆమె ప్రయత్నం చేస్తున్నారు. దీంతో శనివారం కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం ఉంది.